
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్(West Bengal)లో మమతా బెనర్జీ(Mamata Banerjee) ప్రభుత్వానికి, గవర్నర్ జగదీప్ ధన్కర్(Jagdeep Dhankar)కు మధ్య వైరం ముగిసేలా లేదు. దీదీ ప్రభుత్వంపై గవర్నర్ జగదీప్ ధన్కర్ తరుచూ విమర్శలు చేస్తూనే ఉంటారు. దీనికి ప్రభుత్వ పెద్దలు కూడా దీటుగానే స్పందిస్తూ ఉంటారు. ఇటీవల ఏకంగా మమతా బెనర్జీనే గవర్నర్ ధన్కర్‌పై ఫైర్ అయ్యారు. ఏకంగా ప్రెస్ మీట్‌లోనే గవర్నర్‌పై నిప్పులు గక్కారు. ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య ఈ వైరం కారణంగా ఇప్పుడు ఒక కొత్త పరిణామం మొదలయ్యే అవకాశం ఉన్నది.
ఈ నేపథ్యంలోనే బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్విట్టర్‌లో కీలక పోస్టు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మార్చి 7వ తేదీ అర్ధరాత్రి(Midnight) దాటిన తర్వాత 2 గంటలకు అసెంబ్లీ సమావేశాల(Assembly Session) ప్రారంభానికి అంగీకరిస్తున్నట్టు పేర్కొన్నారు. రాత్రి 2 గంటలకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ ఒక అసాధారణమైన నిర్ణయం అని తెలిపారు. ఈ ఘట్టం చరిత్రలో నిలిచిపోతుందని వివరించారు. కానీ, అర్ధరాత్రి సమావేశాలు ప్రారంభించాలన్నది క్యాబినెట్ నిర్ణయం అని పేర్కొన్నారు.
ఫిబ్రవరి 17న రాష్ట్ర ప్రభుత్వం.. గవర్నర్‌కు పంపిన ఓ నోట్‌తో ఈ వ్యవహారం మొదలైంది. మార్చి 7వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఓ నోట్ పంపింది. అయితే, ఆ రికమెండేషన్‌లను గవర్నర్ వెనక్కి పంపారు. రాష్ట్ర క్యాబినెట్ సిఫారసు చేస్తే రాజ్యాంగం ప్రకారం తాను వాటికి స్పందిస్తానని పేర్కొన్నారు. మరోసారి సవరించి నోట్ పంపినప్పడు అందులో చిన్న టైపింగ్ మిస్టేక్ పడింది. మధ్యాహ్నం 2 గంటల(2 పీఎం) సమయం.. అర్ధరాత్రి 2 గంటలు(2 ఏఎం)గా పడింది.
దీంతో గవర్నర్ ఆ సమయాన్ని చూశారు. అసెంబ్లీ సమావేశాలు రాత్రి 2 గంటల ప్రాంతంలో ప్రారంభించడాన్ని ఆయన తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్ర క్యాబినెట్ అసెంబ్లీ సమావేశాలు మార్చి 7వ తేదీ రాత్రి 2 గంటలకు ప్రారంభించాలని సిఫారసు చేస్తూ తనకు నోట్ వచ్చిందని, అందుకు తాను అంగీకరించానని వివరించారు. అయితే, అంగీకరించడానికి ముందు తాను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి కాల్ చేశారని, దీనిపై చర్చించాలని ప్రయత్నించానని పేర్కొన్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపే ఆ అంశంపై అత్యవసరంగా మాట్లాడాలనే ప్రయత్నం జరిగిందని తెలిపారు. కానీ, చీఫ్ సెక్రెటరీ అందుకు సకాలంలో స్పందించలేదని వివరించారు. ఆ తర్వాతే తాను మార్చి 7వ తేదీ అర్ధరాత్రి 2 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలన్న క్యాబినెట్ నిర్ణయానికి అంగీకారం తెలిపానని పేర్కొన్నారు.
కాగా, గవర్నర్ జగదీప్ ధన్కర్ ట్వీట్‌పై బెంగాల్ స్పీకర్ విమన్ బెనర్జీ స్పందించారు. 2 పీఎం అని పడాల్సిన చోట 2 ఏఎం అని పడిందని, అందుకే అది రాత్రి 2 గంటలుగా తప్పుగా టైప్ అయిందని తెలిపారు. ఈ తప్పును రాష్ట్ర గవర్నర్ పరిగణనలోకి తీసుకుని సరి చేయాల్సిందని అన్నారు. కానీ, ఆయన ఆ పని చేయలేదని తెలిపారు. కాబట్టి, అర్ధరాత్రి తర్వాతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయని వివరించారు.
గవర్నర్‌కు ప్రభుత్వం పంపిన తొలి రెండు నోట్స్‌లోనూ సరిగ్గానే సమయం 2 పీఎం అని పడింది. కానీ, చివరి నోట్‌లో 2 ఏఎం అని పడిందని ఆయన తెలిపారు. ఒక వేళ నిజంగానే బెంగాల్ అసెంబ్లీ అర్ధరాత్రి 2 గంటలకు ప్రారంభం అయితే అది రికార్డే అవుతుంది. అలా మన దేశంలో అర్ధరాత్రి ప్రారంభమైన తొలి అసెంబ్లీగా చరిత్రలో ఉంటుంది.