
న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో రష్యా దాడులు జరుగుతూనే ఉన్నాయి. రష్యా సేనలను ఎదుర్కోవడానికి ఉక్రెయిన్ సైన్యం చర్యలు తీసుకుంటున్నది. ఈ క్రమంలో రష్యాలోని ఖార్కివ్ నగరంలో జరిగిన షెల్లింగ్ దాడిలో ఓ భారతీయ విద్యార్థి దుర్మరణం చెందాడు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.
ఖార్కివ్‌లో ఈ రోజు ఉదయం జరిగిన షెల్లింగ్‌లో ఓ భారతీయ విద్యార్థి మరణించాడని చెప్పడానికి చింతిస్తున్నామని విదేశాంగ శాఖ అధికారిక ప్రతినిధి అరిందమ్ బాగ్చి ట్విట్టర్‌లో వెల్లడించారు. కేంద్ర విదేశాంగ శాఖ బాధిత కుటుంబంతో టచ్‌లో ఉన్నదని వివరించారు. ఉక్రెయిన్‌లో మరణించిన విద్యార్థి కుటుంబానికి తాము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. మృతుడిని కర్ణాటకకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ఖార్కివ్‌లోని గవర్నర్ హౌజ్ ఎదుట మరికొందరితో పాటు ఆయన ఆహారాన్ని తీసుకుంటుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఖార్కివ్‌లోని స్థానిక విద్యార్థుల కాంట్రాక్టర్, ఆయన విద్యార్థులు నవీన్ మృతదేహాన్ని గుర్తించారు. కాగా, విదేశాంగ శాఖ నవీన్ మరణాన్ని ధ్రువీకరించింది.
అదే విధంగా ఉక్రెయిన్, రష్యా అంబాసిడర్‌లను కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి సంప్రదించాడని, ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి చేరుకోవడానికి సహకరించాలనే తమ డిమాండ్‌ను మరోసారి నొక్కి చెప్పనున్నట్టు వివరించారు. ఖార్కింగ్ సహా ఇతర ఉద్రిక్తత ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులను సేఫ్‌గా అక్కడి నుంచి తరలించడానికి సహకరించాలని తెలిపారు. ఉక్రెయిన్, రష్యాల్లోని భారత అంబాసిడర్లు ఇవే డిమాండ్లను మరోసారి లేవనెత్తుతారని పేర్కొన్నారు.
ఈ వార్తపై కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా స్పందించారు. ఈ విషాదం బాధాకరమని అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో మరణించిన విద్యార్థి కుటుంబం, ఇంకా ఉక్రెయిన్‌లో చిక్కుకుని స్వదేశానికి తిరిగిరావడానికి తల్లడిల్లుతున్న వారి కుటుంబాల పట్ల తాను సానుభూతితో ఉన్నట్టు వివరించారు. వారిని అందరినీ సురక్షితంగా భారత్‌కు తీసుకురావడానికి అన్ని విధాల ప్రయత్నాలు చేయాలని పేర్కొన్నారు.
ఉక్రెయిన్ నుంచి భారత పౌరులను స్వదేశానికి తరలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఆపరేషన్ గంగ’ ప్రకటించింది. అంతేకాదు, కొందరు కేంద్ర మంత్రులను ఈ తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి ఏకంగా ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపింది.
ఉక్రెయిన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి భారత ప్రభుత్వం 1396 మంది భారతీయులను సురక్షితంగా ఇంటికి తరలించింది. అంతేకాదు, ప్రధాని నరేంద్ర మోడీ టాప్ మినిస్టర్లను ప్రత్యేక దౌత్యసిబ్బందిగా పంపారు. రొమేనియా మొల్డోవాల్లో తరలింపు ప్రక్రియను పర్యవేక్షించడానికి పౌర విమానయాన జ్యోతిరాదిత్య సింధియాను, స్లోవేకియాలో ఈ బాధ్యతలను న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు, హంగేరికి పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పురి, పొలాండ్ నుంచి తరలింపులను సమన్వయం చేయడానికి కేంద్ర రోడ్డు రవాణ శాఖ సహాయ మంత్రి జనరల్ వీకే సింగ్‌ను పంపారు.