
ఉక్రెయిన్ పై రష్యా దాడులు కొనసాగిస్తోంది. యుద్దం ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలేవీ సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఉక్రెయిన్ లో చదువుకునేందుకు వెళ్లిన ఇతర దేశాల విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారు. ఇందులో మన దేశ విద్యార్థులు కూడా ఉన్నారు. మన దేశ విద్యార్థులను ఇక్కడికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం ఆపరేషన్ గంగా పేరిట ప్రత్యేక కార్యాచరణను చేపడుతోంది. దీని ద్వారా ఇప్పటికే వేలాది మంది స్టూడెంట్లను ఇండియాకు తీసుకొచ్చింది.
అయితే ఇప్పటికీ చాలా మంది స్టూడెంట్లు ఇంకా అక్కడే ఉండిపోయారు. ఈశాన్య ఉక్రెయిన్‌లోని సుమీలో చాలా మంది భారత స్టూడెంట్లు చిక్కుకుపోయారు. తమను కాపాడాలని వారు వీడియో రికార్డ్ చేసి పోస్ట్ చేస్తున్నారు. ఈ విజ్ఞప్తులు ఎక్కువవుతుండటంతో ఇండియన్ ఎంబసీ స్పందించింది. స్టూడెంట్లను సురక్షితంగా తరలించడానికి సాధ్యమైన అన్ని దారులను అన్వేషిస్తున్నట్లు చెప్పింది. ఈ మేరకు శనివారం తెల్లవారుజామున ట్వీట్ చేసింది. స్టూడెంట్లను ఇండియాకు తీసుకురావడం విషయంలో ప్రపంచవ్యాప్త మానవతా సంస్థ రెడ్‌క్రాస్‌తో కలిసి అన్ని మార్గాలను వెతుకుతున్నామని తెలిపింది.
“ సుమీలోని భారతీయ పౌరులను సురక్షితంగా తరలించడానికి సాధ్యమయ్యే అన్ని విధానాలను అన్వేషించేందుకు రెడ్‌క్రాస్‌తో పాటు అన్ని ఇంటర్‌లోక్యూటర్‌లతో చర్చించారు. మా పౌరులందరినీ ఖాళీ చేసే వరకు కంట్రోల్ రూమ్ సక్రమంగా కొనసాగుతుంది. సురక్షితంగా ఉండండి. ధైర్యంగా ఉండండి’’ అని ఉక్రెయిన్ లోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది.
ఖార్కివ్, సుమీ యుద్ధ ప్రాంతాల నుంచి తమ పౌరుల తరలింపు కోసం భారత్ శుక్రవారం రష్యా, ఉక్రేనియన్ దళాలను కాల్పులు విమరించాలని కోరింది. కనీసం 1,000 మంది భారతీయులు, అందులో సుమీలో 700 మంది, ఖార్కివ్‌లో 300 మంది తూర్పు ఉక్రెయిన్‌లోని సంఘర్షణ ప్రాంతాలలో ఇప్పటికీ చిక్కుకుపోయారని తెలిపింది. వారిని తరలించడానికి బస్సులను ఏర్పాటు చేయడం ఇప్పుడు పెద్ద సమస్యగా ఉద్భవించిందని భారత్ చెప్పింది.
సుమీ స్టేట్ యూనివర్శిటీలోని చాలా మంది ఇండియన్ స్టూడెంట్లు తమ ప్రాణాలు కాపాడాలని ఉద్వేగభరితంగా ప్రధాని నరేంద్ర మోడీకి విజ్ఞప్తి చేశారు. తమ యూనివర్శిటీ క్యాంపస్ దగ్గర బాంబులు పడుతున్నాయని, తుపాకీ కాల్పుల సౌండ్ లు, వైమానిక దాడుల సౌండ్ లు పదే పదే వినిపిస్తున్నాయని ఆ పోస్ట్ లో స్టూడెంట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని మేము ఎదురుచూస్తున్నాం. కానీ మాకు ఎలాంటి సమాచారం రాలేదు. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న రష్యా సరిహద్దులో బస్సులు ఆగి ఉన్నాయని కొందరు చెబుతున్నారు. హాస్టల్ నుంచి నడుస్తుంటే నాలుగు దిక్కులూ, ఎక్కడ చూసినా స్నిపర్లే. మేము వైమానిక దాడులకు భయపడుతున్నాం. ప్రతీ 20 నిమిషాలకు ఒక బాంబు పేలుడు జరుగుతోంది’’ అని ఆ వీడియోలో స్టూడెంట్లు వేడుకున్నారు.
భోజనం, నీళ్లతో పాటు ముఖ్యమైన కొన్ని వస్తువులు కూడా అయిపోయాయని స్డూడెంట్లు తమ దీన స్థితిని తెలియజేశారు. స్టూడెంట్లు తాగేందుకు నీటిని తయారు చేసుకునేందుకు గడ్డకట్టే ఊష్ణోగ్రతలోనూ అక్కడ ఉన్న మంచును సేకరిస్తున్నారు. ఈ దృష్యాలు వారు పోస్ట్ చేసిన వీడియోలో కనిపిస్తున్నాయి.
విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రతినిధి అరిందమ్ బాగ్చీ మీడియాతో మాట్లాడుతూ.. యుద్ధం ప్రారంభం కంటే ముందే భారత్ జారీ చేసిన సూచనలతో దాదాపు 20 వేల మంది ఉక్రెయిన్ ను ఫిబ్రవరి మధ్యలోనే విడిచిపెట్టారని తెలిపారు. ఇప్పటి వరకు 10,300 మంది స్టూడెంట్లను మిషన్ ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుంచి ఇండియాకు 48 తరలింపు విమానాల్లో తీసుకొచ్చామని తెలిపారు.