
కేరళ : యుద్ధం అనేక జీవితాల్ని తలకిందులు చేస్తుంది. ఎంతోమందిని శరణార్థులుగా, అనాథలుగా.. నిరుపేదలుగా మారుస్తుంది. ఇక యుద్ధసమయంలో గర్భిణిగా ఉంటే ఆ పరిస్థితి నరకం.. అలాంటి పరిస్థితే ఎదురయ్యంది ఓ భారతీయ జంటకు. ముప్పేట యుద్ధం జరుగతున్న Ukraine రాజధాని కైవ్ లో నిండు గర్భిణి అయిన భార్యతో సహా చిక్కుకుపోయాడో వ్యక్తి.
Keralaకు చెందిన ఒక వ్యక్తి తొమ్మిదినెలల నిండు గర్బిణి అయిన భార్యతో సహా కైవ్ లో చిక్కుకుపోయాడు.. Operation Ganga కార్యక్రమం కింద భారత రాయబార కార్యాలయ సిబ్బంది సహాయంతో సురక్షితంగా అక్కడినుంచి బయటపడ్డాడు. తన బిడ్డకు తమ ప్రాణాలు కాపాడిన ‘ఆపరేషన్ గంగ’కు గుర్తుగా ‘గంగా’ అని నామకరణం చేస్తానని చెబుతున్నాడు.
కేరళకు చెందిన అభిజిత్ కైవ్ నుండి పోలాండ్‌లోని ర్జెస్జో లో భారత రాయబార కార్యాలయం ఏర్పాటు చేసిన షెల్టర్ రూమ్‌లో సురక్షితంగా చేరుకున్నాడు. ఈ సంతోషాన్ని అతను అక్కడి వచ్చిన మీడియాతో పంచుకున్నాడు. ఆ పరిస్తితులు చెబుతూ..
"నా భార్య తొమ్మిది నెలల గర్భిణి. ఆరోగ్యం బాగాలేక పోలాండ్‌లోని ఆసుపత్రిలో చేరింది. అంతలోనే యుద్ధం కారణంగా చాలా కంగారు పడ్డాం. కానీ భారత్ చేపట్టిన ఆపరేషన్ గంగా తో అక్కడినుంచి ప్రాణాలతో బయటపడ్డాం. ప్రస్తుతం నా భార్య ఆరోగ్యం, కడుపులోని బిడ్డ ఆరోగ్యం బాగానే ఉందని ఆసుపత్రివర్గాలు చెబుతున్నాయి. తన డెలివరీ తేదీ మార్చి 26న ఇచ్చారు. పుట్టబోయే నా బిడ్డకు భారతదేశం ప్రారంభించిన రెస్క్యూ ఆపరేషన్ పేరు మీదుగా గంగ అని పేరు పెట్టాలనుకుంటున్నా" అని అభిజీత్ చెప్పాడు,
తన భార్య వైద్యపరమైన భద్రతా కారణాల దృష్ట్యా పోలాండ్ ఆసుపత్రిలో ఉండవలసి ఉండగా తాను భారతదేశానికి వస్తున్నానని చెప్పాడు. అభిజిత్ కైవ్‌లో రెస్టారెంట్ నడుపుతున్నాడు. యుద్ధంలో చిక్కుకున్నాడు, ఆ తర్వాత అతను ఉక్రెయిన్ నుండి రక్షించబడి పోలాండ్ చేరాడు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయులను రక్షించేందుకు భారత్ ఆపరేషన్ గంగాను ప్రారంభించింది. తర్వాత, రెస్క్యూ ఎక్సర్‌సైజ్ స్థాయిని పెంచేందుకు భారత వైమానిక దళం సహాయక చర్యలకు పూనుకుంది.
ఆపరేషన్ గంగా అనేది ఉక్రెయిన్‌లో రష్యాచే కొనసాగుతున్న సైనిక చర్య మధ్య మానవతా సహాయం అందించడానికి, ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను తరలించడానికి ప్రభుత్వంచే కొనసాగుతున్న ఆపరేషన్.
ఇదిలా ఉండగా, శుక్రవారం Russia దాడితో ప్రపంచానికి అతిపెద్ద అణు ప్రమాదం ముంచుకు రాబోతోంది. ఈ మేరకు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా మాట్లాడుతూ, "యూరప్‌లోని అతిపెద్ద Nuclear Plant అయిన జపోరిజ్జియా NPPపై రష్యా సైన్యం అన్ని వైపుల నుండి కాల్పులు జరుపుతోంది. ఇప్పటికే మంటలు చెలరేగాయి. అది పేలినట్లయితే, Chernobyl కంటే 10 రెట్లు ఎక్కువ నష్టం జరిగే ప్రమాద ఉంది’’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
Europeలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ రష్యా దాడి తర్వాత మంటల్లో చిక్కుకుందని ఆ కేంద్రం సమీపంలోని పట్టణ మేయర్ తెలిపారు. రష్యన్ దళాలు కాల్పులు జరుపుతున్నందున అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేయలేకపోతున్నారని తెలిపారు.