మార్కెట్లోకి రావాలంటే రూ.5ల టికెట్.. లాక్ డౌన్ తప్పించుకోవడానికి వినూత్న ప్రయోగం..

By AN TeluguFirst Published Mar 31, 2021, 10:51 AM IST
Highlights

లాక్ డౌన్ నుంచి తప్పించుకోవడానికి అదే సమయంలో కేసుల సంఖ్యను కట్టడి చేయడానికి మహారాష్ట్రలోని ఓ మార్కెట్లో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు.

లాక్ డౌన్ నుంచి తప్పించుకోవడానికి అదే సమయంలో కేసుల సంఖ్యను కట్టడి చేయడానికి మహారాష్ట్రలోని ఓ మార్కెట్లో కొత్త పద్ధతిని ప్రవేశపెట్టారు.

నాసిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగం ఈ  మేరకు మార్కెట్ కు వచ్చే వ్యక్తులకు గంటకు ఐదు రూపాయల చొప్పున వసూలు చేయనుంది. రూ.5ల టికెట్లను ఇవ్వనుంది. ఒక వ్యక్తికి ఒక టికెట్ ఇస్తారు. నాసిక్ లో కోవిడ్ 19 కేసుల పెరుగుదలను ఆపడానికే తామీ నిర్ణయానికి వచ్చినట్టు నాసిక్ సిటీ పోలీస్ కమీషనర్ దీపక్ పాండే తెలిపారు. 

మార్చి 30న మహారాష్ట్రలో కొత్తగా 27,918 కోవిడ్ -19 కేసులు నమోదు కాగా, 139 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి రాజేష్ తోపే ప్రజలందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 

రాష్ట్రంలోని అన్ని ఆస్పత్రుల్లో ఐసీయూ, ఆక్సీజన్ బెడ్లు నిండిపోయాయని, పరిస్థితి బాగా విషమించిన తరువాత టెస్టులు చేయించుకోవడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని రాజేష్ తోపే అన్నారు. ముందుగానే పరీక్షలు చేయించుకుంటే పరిస్థితులు విషమించకుండా, ఎక్కువమందికి సోకకుండా కాపాడవచ్చని అందుకే ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నానని’ రాజేష్ తోపే చెప్పారు.

మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ మరో లాక్ డౌన్ ను రాష్ట్రం భరించలేదని, అందుకే వైరస్ కట్టడికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేను కోరారు.

‘మరో లాక్ డౌన్ ను భరించలేము. అందుకే వేరే మార్గాలు కూడా పరిగణలోకి తీసుకోవాలని మేము ముఖ్యమంత్రిని కోరాం. లాక్డౌన్ కోసం సిద్ధం కావాలని ఆయన పరిపాలన అధికారులను ఆదేశించారు, కానీ దీని అర్థం లాక్డౌన్ అనివార్యమని  కాదు. ప్రజలు జాగురుకతతో ఉండి, సరిగా నియమనిబంధనలు పాటిస్తే దీన్నినివారించవచ్చు "అని నవాబ్ మాలిక్ మంగళవారం చెప్పారు.

ఉన్నతస్థాయి వైద్యాధికారులు, కోవిడ్ 19 టాస్క్ ఫోర్స్ తో జరిపిన సమావేశంలో ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే మాట్లాడుతూ.. ప్రజలు కోవిడ్ నిబంధనలను పదే పదే ఉల్లంఘిస్తూ ఉంటే లాక్ డౌన్ లాంటి ఆంక్షలకు సిద్ధం కావాలని ఆదేశించారు. 

ప్రజలు మార్గదర్శకాలను తేలిగ్గా తీసుకుని, పాటించనందున కోవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల లాక్డౌన్ వంటి కఠినమైన చర్యలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు.

click me!