కేంద్ర మంత్రివర్గ విస్తరణ: మరుసటి రోజే తొలి కేబినెట్ భేటీ, కీలక నిర్ణయాలు

By Siva KodatiFirst Published Jul 8, 2021, 8:17 PM IST
Highlights

బుధవారం 43 మందితో కేంద్ర మండలి విస్తరణ జరిగిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రే కొత్త మంత్రులకు శాఖలను సైతం కేటాయించారు ప్రధాని మోడీ. ఆ తర్వాతి రోజే తొలి కేబినెట్ భేటీ జరిగింది. 

కేంద్ర మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా కేబినెట్ సమావేశమైంది. గురువారం ప్రధాని నరేంద్రమోడీ అధ్యక్షతన భేటీ అయిన మంత్రి మండలి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలను కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ మీడియాకు ప్రకటించారు. ఏపీఎంసీలను (మండీలు) మరింత బలోపేతం చేయాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. మండీలకు మరిన్ని వనరులను అందించడానికి తాము సిద్ధమని, అందుకు తగ్గ ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని తోమర్ తెలిపారు . ఆత్మనిర్భర భారత్ ప్యాకేజీ కింద మండీలకు లక్ష కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.

నూతన సాగు చట్టాలను రద్దు చేసే ప్రసక్తే లేదని వ్యవసాయ మంత్రి పునరుద్ఘాటించారు. సాగు చట్టాల వల్ల మండీలకు వచ్చే నష్టమేమీ లేదని, నూతన సాగు చట్టాల అమలు వల్ల మండీలకు కోట్ల రూపాయల లాభం వస్తుందని ఆయన తెలిపారు. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు కీలక పాత్ర పోషిస్తోందని, అందుకే తాము కొకొనట్ బోర్డు యాక్ట్‌‌ను సవర్తిస్తున్నామని ప్రకటించారు.

Also Read:కేంద్ర కేబినెట్ విస్తరణ: మంత్రులకు శాఖల కేటాయింపు.. అమిత్ షాకు సహకార, కిషన్ రెడ్డికి పర్యాటకం

కొబ్బరి బోర్డుకు అధికారులు ఉండరని, వారి స్థానంలో వ్యవసాయ క్షేత్రం నుంచి వచ్చేవారు బోర్డు అధ్యక్షుడిగా ఉంటారని తోమర్ పేర్కొన్నారు. ఇలా చేయడం ద్వారా కొబ్బరి క్షేత్రాన్ని మరింత జీర్ణించుకొని, మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయని కేంద్ర వ్యవసాయ మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ బోర్డులో ఆంధ్రప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలను సభ్యులుగా చేరుస్తున్నామని ఆయన ప్రకటించారు. కేంద్ర ఆరోగ్యశాఖా మంత్రి మన్సుఖ్ మాండవీయ మాట్లాడుతూ... సెకండ్ వేవ్ తర్వాత తలెత్తిన సమస్యలను పరిష్కరించడానికి 23,000 కోట్ల రూపాయల ‘హెల్త్ ఎమర్జెన్సీ ప్యాకేజీ’ని ఇస్తున్నట్లు ప్రకటించారు. 

click me!