RRB NTPC రిజల్ట్‌పై నిరసన.. ఏకంగా రైలుకే నిప్పుపెట్టారు.. ఫలితాలపై రైల్వే బోర్డు కీలక నిర్ణయం..

By Sumanth KanukulaFirst Published Jan 26, 2022, 3:02 PM IST
Highlights

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) సీబీటీ-1 పరీక్ష‌ ఫలితాలకు వ్యతిరేకంగా బిహార్‌లోని పలు రైల్వే స్టేషన్లలో ఉద్యోగ ఆశావాదులు గత రెండు కొద్ది రోజులుగా ఆందోళన కొనసాగిస్తున్నారు.

రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న పలువురు అభ్యర్థులు ఆందోళనలకు దిగుతున్నారు.  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ (RRB-NTPC) సీబీటీ-1 పరీక్ష‌ ఫలితాలకు వ్యతిరేకంగా బిహార్‌లోని పలు రైల్వే స్టేషన్లలో ఉద్యోగ ఆశావాదులు గత రెండు మూడు రోజులుగా ఆందోళనకు దిగుతున్నారు. ఆందోళనకారులు రైళ్లను ధ్వంసం చేయడంతోపాటు రైళ్లపైకి రాళ్లు రువ్వుతున్నారు. తాజాగా నిరసన వ్యక్తం చేస్తున్న వందలాది మంది ఉద్యోగ ఆశావాదులు బుధవారం బీహార్‌లోని గయా జంక్షన్‌లో Bhabua Road InterCity Expressకు నిప్పు పెట్టారు. దీంతో రైలులోని పలు బోగీలు దగ్దమైనట్టుగా సమాచారం.

మరోవైపు నిరసనకారులు.. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బందితో కూడా ఘర్షణ దిగారు. వారిపై కూడా రాళ్లు రువ్వారు. పరిస్థితి హింసాత్మకంగా మారుతుండటంతో.. ఆర్‌ఫీఎస్ సిబ్బంది పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆశావహులపై బాష్పవాయువు షెల్‌లను ప్రయోగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉన్నట్టుగా గయా Senior Superintendent of Police (SSP) ఆదిత్య కుమార్ తెలిపారు. రైలుకు నిప్పుపెట్టిన వారిలో కొందరిని గుర్తించినట్టుగా చెప్పారు.

ఇక, రైలుకు మంటల్లో కాలిపోతున్న  దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  రైల్వే స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్‌పై రాళ్లు కనిపిస్తున్నాయి. ఆందోళనకారుల దాడిలో రైలు కిటికీలు కూడా విరిగిపోయాయి. ఇక, ఈ ఆందోళన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుంది. ఉద్యోగ ఆశావహులు నేడు న్యూఢిల్లీ- కోల్‌కతా ప్రధాన రైల్వే ట్రాక్‌లను దిగ్బంధించారు. మరికొందరు బీహార్‌లోని అర్రా, షరీఫ్ రైల్వే స్టేషన్‌లలో నిరసన తెలిపారు.

రైల్వే అశావహుల ఆందోళనపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన చెందిన ప్రతినిధి ఒకరు స్పందించారు. పరీక్షలో క్వాలిఫై కాలేని అభ్యర్థుల అభిప్రాయాలను రైల్వే మంత్రిత్వ శాఖ ఒక కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆ కమిటీ తన నివేదికను రైల్వే మంత్రిత్వ శాఖకు అందజేస్తుందని చెప్పారు. ఆ తర్వాత పరీక్షపై రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.

ఇక, రైల్వే మంత్రిత్వ శాఖ ఆర్‌ఆర్‌బీ ఎన్టీపీసీ సీబీటీ-1ను 2020 డిసెంబర్ 28 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 8 వరకు ఆరు దశలలో ఈ పరీక్షను నిర్వహించారు. అయితే కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఏడో దశను గతేడాది జూలై నెలలో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఫలితాలను 10 రోజుల కిందట రైల్వే బోర్డు విడుదల చేసింది. సీబీఐ-2కు అర్హత సాధించిన వారి జాబితాను కూడా విడుదల చేసింది. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న కొందరు అశావహులు నిరసన బాట పట్టారు.

click me!