ఆజాద్‌కు పద్మ అవార్డుతో కాంగ్రెస్‌లో మంటలు.. మళ్లీ ఏకమవుతున్న ‘జీ-23’

Published : Jan 26, 2022, 02:32 PM ISTUpdated : Jan 26, 2022, 02:33 PM IST
ఆజాద్‌కు పద్మ అవార్డుతో కాంగ్రెస్‌లో మంటలు.. మళ్లీ ఏకమవుతున్న ‘జీ-23’

సారాంశం

గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మ భూషణ్ అవార్డు ప్రకటించించింది. ఈ అవార్డు కాంగ్రెస్‌లో ఆగ్రహజ్వాలలు రేపింది. జీ-23 బృంద సభ్యులు మరోసారి ఏకం కావడానికి ఓ అవకాశం ముందుకు వచ్చింది. గులాం నబీ ఆజాద్‌కు ఈ గ్రూప్ సభ్యులు అభినందనలు చెబుతుండగా, పార్టీ నాయకత్వానికి విశ్వాసంగా మెదిలే నేతలు విమర్శలు చేస్తున్నారు. కపిల్ సిబల్ ఏకంగా గులాం నబీ ఆజాద్‌కు ఈ అవార్డుపై అభినందనలు చెబుతూ.. కాంగ్రెస్‌పై సూటిగా విమర్శలు ఎక్కుపెట్టారు.  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్(Congress) సీనియర్ నేత గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు(Padma Bhushan Award) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ అవార్డు ప్రకటన కాంగ్రెస్‌లో కలకలం రేపింది. మరోసారి కాంగ్రెస్‌లోని విభేదాలు రచ్చకెక్కాయి. జీ-23 లేదా 23 మంది రెబల్ గ్రూప్ మరోసారి ఏకం అవుతున్నది. కాగా, కాంగ్రెస్ నాయకత్వ వర్గం జీ-23 నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఆజాద్‌(Ghulam Nabi Azad)కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించడాన్ని జీ-23(G-23) నేతలు స్వాగతించారు. గులాం నబీ ఆజాద్‌కు అభినందనలు తెలియజేశారు. కొందరైతే.. ఆయనకు అభినందనలు తెలుపుతూ కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు.

గులాం నబీ ఆజాద్‌కు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ లీడర్ ఆనంద్ శర్మ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ప్రజలకు సేవ చేయడంలో, దేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి ఆయన జీవితంలో చేసిన విలువైన సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్ అవార్డు ఆయనకు ప్రకటించడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. ఆయన సేవలకు ఈ అవార్డు రావడం సమంజసమని పేర్కొన్నారు. ఆయనకు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు. కాగా, మరో సీనియర్ నేత కపిల్ సిబల్ మాత్రం సూటిగా కాంగ్రెస్‌కు తగిలేలా ట్వీట్ చేశారు.

గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించారని ఆయన ట్వీట్ చేశారు. భాయ్ జాన్‌కు అభినందనలు అని పేర్కొన్నారు. ఆయన ప్రజా జీవితాన్ని దేశమే గుర్తించిందని, కానీ, కాంగ్రెస్‌ మాత్రం ఆయన సేవలు అవసరం లేదని భావించడం బాధాకరం అని ట్వీట్ చేశారు. మరో కాంగ్రెస్ నేత రాజ్ బబ్బార్ కూడా గులాం నబీకి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేశారు. గులాం నబీ ఆజాద్ సాహెబ్‌కు కంగ్రాట్స్ అంటూ రాజ్ బబ్బార్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. గాంధేయ విలువలకు కట్టుబడి ఉండటంలో, ప్రజా సేవ చేయడంలో ఆయన తమకు ఎల్లప్పుడు ప్రేరణగా ఉంటారని వివరించారు. గులాం నబీ ఆజాద్ దేశానికి ఐదు దశాబ్దాలుగా చేస్తున్న సేవలకు గుర్తింపుగా పద్మ భూషణ్ వచ్చిందని పేర్కొన్నారు.

కాగా, గులాం నబీ ఆజాద్‌కు పద్మ భూషణ్ అవార్డు రావడంపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ, పద్మ అవార్డు విజేతల జాబితా బయటకు రాగానే జైరాం రమేశ్.. గులాం నబీ ఆజాద్‌పై విరుచుకుపడ్డారు. ఆయన గులాం అని, ఆజాద్ కాదని పరోక్షంగా గులాం నబీ ఆజాద్‌ను పేర్కొంటూ ట్వీట్లు చేశారు. సీపీఎం నేత, పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం బుద్ధదేవ్ భట్టాచర్య పద్మ భూషణ్ అవార్డును తిరస్కరించారు. ఆ వార్తను ఓ రిపోర్టర్ ట్వీట్ చేశారు. దాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని ఇలా చేయడమే సరైన పని అని జైరాం రమేశ్ పేర్కొన్నారు. ఆయన బుద్ధదేవ్ భట్టాచర్య ఆజాద్‌గా ఉండాలని అనుకున్నారని, గులాంగా కాదని తెలిపారు.

గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మలు కాంగ్రెస్ రెబల్స్ లేదా జీ 23లో ఉన్నారు. కాంగ్రెస్‌లో సమూల ప్రక్షాళన అవసరం అని, నాయకత్వ మార్పులూ అవసరం అని సోనియా గాంధీకి ఫిర్యాదు చేసిన 23 మందిలో వీరు ఉన్నారు. ఆ లేఖ కాంగ్రెస్‌లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలు, పార్టీలోని గాంధీలపై వేలెత్తి చూపకుండా ఉండటం వంటి జాఢ్యాలను ఆ లేఖ పటాపంచలు చేసింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

AI Smart Glasses : పోలీసుల చేతికి ఏఐ అస్త్రం.. ఈ మ్యాజిక్ గ్లాసెస్ నేరస్తులను ఎలా గుర్తిస్తాయి?
uttar Pradsh : ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే టాప్... ఏ రాష్ట్రమో తెలుసా?