UP Elections 2022: కాంగ్రెస్‌కు పెద్ద దెబ్బ.. కేంద్ర మాజీ మంత్రి పార్టీకి రాజీనామా.. త్వరలో బీజేపీలోకి?

By Mahesh KFirst Published Jan 25, 2022, 1:25 PM IST
Highlights

ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపించిన తరుణంలో కాంగ్రెస్ పెద్ద దెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పెద్ద తలకాయగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ పార్టీకి రాజీనామా చేశారు. గణతంత్ర వేడుకలు జరుగుతున్న తరుణంలో తాను తన రాజకీయ ప్రస్థానంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశిస్తూ రాసిన తన రాజీనామా లేఖలో పార్టీపైగాని, దాని నాయకత్వంపైగాని ఎలాంటి నిందారోపణలు చేయలేదు. ఆయన త్వరలోనే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
 

లక్నో: అసెంబ్లీ ఎన్నికల(Assembly Elections) ముంగిట్లో ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని స్థాయిలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయి. మొన్నటి వరకు బీజేపీ(BJP)కి షాక్ ఇస్తూ మంత్రులు సహా ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో పార్టీకి రాజీనామాలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, కాంగ్రెస్‌(Congress)కు పెద్ద దెబ్బ తగిలింది. కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్(RPN Singh) పార్టీకి రాజీనామా(Resignation) చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికలు సమీపించిన తరుణంలో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పెద్ద తలకాయ వంటి ఆర్‌పీఎన్ సింగ్ రాజీనామా చేయడం పార్టీకి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ముప్పు ఉన్నది. ఆర్‌పీఎన్ సింగ్ త్వరలో బీజేపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నదని ఇవాళ ఉదయం నుంచే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన తన రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేశారు. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రెండో నేత ఈయన. అంతకు ముందే కాంగ్రెస్ సీనియర్ నేత జితిన్ ప్రసాదా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆయన యోగి ఆదిత్యానాథ్ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్న సంగతి తెలిసిందే.

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఉద్దేశిస్తూ ఆర్‌పీఎన్ సింగ్ రాసిన లేఖలో కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వెంటనే అమలవుతుందని వివరించారు. ఈ దేశానికి, ప్రజలకు, పార్టీకి సేవలు అందించే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. ఈ రాజీనామా లేఖను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ ఓ కామెంట్ చేశారు. భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన రోజును వేడుక చేసుకుంటున్న తరుణంలో తన రాజకీయ ప్రస్థానలో నూతన అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు. జై హింద్ అని చివరన పేర్కొన్నారు.

ఈ రోజు పొద్దున్నే కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ తన ట్విట్టర్ బయోను మార్చగానే ఈ అనుమానాలు మొదలయ్యాయి. తన ట్విట్టర్ బయో నుంచి ఆయన కాంగ్రెస్ అనే పదాన్ని తొలిగించారు. దీంతో ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నాడని చాలా మంది భావించారు. అదే సమయంలో ఆయన బీజేపీలోకి చేరబోతున్నట్టు చర్చ నడుస్తున్నది.  అయితే, బీజేపీలోకి చేరే విషయంపై ఆయన ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటన చేయలేదు. ఇటు బీజేపీ వైపు నుంచి కూడా ఎలాంటి ప్రకటన రాలేదు. ఉత్తరప్రదేశ్‌లోని పద్రౌనా నుంచి ఆర్‌పీఎన్ సింగ్ ఎంపీగా సేవలు అందించారు.

సాధారణంగా ఒక పార్టీ నుంచి మరో పార్టీకి చేరే సందర్భంల నేతలు విడిచిపెడుతున్న పార్టీపై విమర్శలు చేయడం, ఆరోపణలు చేయడం పరిపాటిగా వస్తున్నది. లేదా.. ప్రజలకు సేవ చేయలేకపోయామని, పార్టీ సహకరించలేదనే నిందారోపణలూ చేస్తుంటారు. కానీ, కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్ సింగ్ మాత్రం ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయకుండా హుందాగానే తప్పుకున్నట్టు తెలుస్తున్నది.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను కాంగ్రెస పార్టీ.. ప్రియాంక గాంధీ సారథ్యంలో ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ రాష్ట్రంలో గట్టి పోటీ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీకి మధ్యే కొనసాగుతున్నది.

click me!