ఉచితాలు ప్రకటించి ఓట్లు రాబట్టుకోవడం తీవ్రమైన అంశం.. కేంద్రం, ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు

By Mahesh KFirst Published Jan 25, 2022, 12:54 PM IST
Highlights

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు ప్రలోభాలు, తాయిలాలు, ఉచితాల ప్రకటనలు హద్దు మీరాయని సుప్రీంకోర్టులో బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ఓ పిటిషన్ వేశారు. ఎన్నికలకు ముందే ప్రజాధనంతో ఉచితాలు ప్రకటించే పార్టీల ఎన్నికల గుర్తులను రద్దు చేయాలని, ఆ పార్టీలను డీరిజిస్టర్ చేసేలా ఈసీకి ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్ విచారిస్తూ సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు(Supreme Court)లో ఎన్నికల ప్రచారంలో ప్రకటించే ఉచితాల(Freebies)పై కీలక పిటిషన్ దాఖలైంది. రాజకీయ పార్టీలు(Political Parties) ఇష్టారీతిన వరాల ప్రకటనలు గుప్పిస్తున్నాయని, ప్రజా ధనంతో వాటిని అందిస్తామని ఎన్నికలకు ముందే ఇలాంటి ప్రకటనలు చేయడం సరికాదని, అలా చేయడం లంచం ఇస్తామని ప్రకటించడానికి సరిపోలినదేనని పిటిషనర్ వాదించారు. ప్రలోభ పెట్టడానికి ఏమాత్రం తక్కువ కాదని, ఇలా చేయడం రాజ్యాంగానికి విరుద్ధమనీ పేర్కొన్నారు. అందుకే వీటిని నిరోధించేలా ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలని బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని సుప్రీంకోర్టు(Supreme Court) ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ సారథ్యంలోని జస్టిస్ ఏఎష్ బోపన్న, జస్టిస్ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించడానికి సిద్ధమైంది.

ఎన్నికలకు ముందే రాజకీయ పార్టీలు ప్రజా ధనంతో ఉచితాలు అందిస్తామని వాగ్దానాలు చేయడాన్ని నివారించాలని, అలా ప్రకటించిన పార్టీల ఎన్నికల గుర్తును సీజ్ చేయాలని, ఆ రాజకీయ పార్టీల రిజిస్ట్రేషన్ గుర్తింపును తొలగించాలని పిటిషనర్, బీజేపీ లీడర్ అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ పిటిషన్ వేశారు. ఈ చర్యలు తీసుకునేలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మార్గదర్శకాలు జారీ చేయాలని సుప్రీంకోర్టును కోరారు. అంతేకాదు, ఈ పద్ధతిని అడ్డుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కూడా ఓ చట్టం తీసుకువచ్చేలా ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ విచారిస్తూ సీజేఐ ఎన్వీ రమణ సారథ్యంలోని ధర్మాసనం కేంద్ర ప్రభుత్వానికి, ఎన్నికల సంఘాని(Election Commission of India)కి నోటీసులు జారీ చేసింది.

ఈ పిటిషన్ విచారిస్తూ.. ఉచితాలు, తాయిలాలు ప్రకటిస్తూ ఓట్లను రాబట్టుకోవడం తీవ్రమైన అంశం అని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇాది చాలా తీవ్రమైన విషయం అని సీజేఐ ఎన్వీ రమణ పేర్కొన్నారు. ఈ ఉచిత వాగ్దానాల బడ్జెట్.. రెగ్యులర్ బడ్జెట్‌ను దాటి పోతుందని అన్నారు. ఇది అవినీతి కాకపోయినా.. పోటీలో తారతమ్యాలను సృష్టిస్తుందని వివరించారు. అదే సమయంలో పిటిషన్ కొన్ని అంశాల్లో సెలెక్టివ్‌గా ఉన్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌లో మీరు కేవలం రెండింటినే ప్రస్తావించారు అని సీజేఐ లేవనెత్తారు. మీ అప్రోచ్ కూడా కొంత పరిధి మేరకు ఉన్నదని జస్టిస్ హిమా కోహ్లీ అన్నారు. అయితే, ఈ పిటిషన్‌లో లేవనెత్తిన న్యాయమపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకుని సుప్రీంకోర్టు నోటీసులు పంపింది.

పిటిషన్‌లో పేర్కొన్న కొన్ని అంశాలు ఇలా ఉన్నాయి. రానున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలను ఈ పిటిషన్ ప్రస్తావించింది. ఈ ఎన్నికల్లో ఆప్, కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ ప్రకటించిన కొన్ని హామీలు, ఉచితాలను పేర్కొంది. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ. 1000 ప్రకటించిన ఆప్ పార్టీ హామీని ఈ పిటిషన్ ప్రస్తావించింది. ప్రతి మహిళకు రూ. 2000 ఇస్తామన్న శిరోమణి అకాలీ దళ్ పార్టీ హామీనీ గుర్తు చేసింది. కాంగ్రెస్ ప్రకటనలనూ ఈ పిటిషన్‌లో బీజేపీ నేత అశ్విని కుమార్ ఉపాధ్యాయ్ ప్రస్తావించారు. ప్రతి ఇల్లాలికి నెలకు రూ. 2000 మాత్రమే కాదు.. ఏడాదికి ఎనిమిది ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాలేజీకి వెళ్లే ప్రతి యువతికి స్కూటీ, 12వ తరగతి పాస్ అయిన యువతికి రూ. 20 వేలు, 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికకు రూ. 15వేలు, ఎనిమిదో తరగతి విద్యార్థినులకు రూ. 10వేలు, ఐదో తరగతి విద్యార్థినులకు రూ. 5వేలు అందిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. 

కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే.. 12వ తగరతి చదువుతున్న ప్రతి యువతికి స్మార్ట్ ఫోన్, డిగ్రీ చదువతున్న యువతులకు స్కూటీ, మహిళలకు ఉచిత రవాణా సదుపాయం, ఇల్లాలికి ప్రతి యేడాది ఎనిమిది గ్యాస్ సిలిండర్లు, ప్రతి కుటుంబానికి యేటా మెడికల్ ట్రీట్‌మెంట్ కోసం రూ. 10 లక్షలు అందిస్తామని ప్రకటించింది.

వీటిని ప్రస్తావిస్తూ.. డబ్బు వాగ్దానాలు, ఉచితాల ప్రకటనలు ఆందోళనకర స్థాయికి పెరిగాయని పిటిషనర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. 

click me!