మహిళా కానిస్టేబుళ్ళ మానవత్వం.. రైల్వే స్వీపర్ కు ప్రసవం..తల్లీ బిడ్డా క్షేమం..

By SumaBala BukkaFirst Published Jun 2, 2023, 10:38 AM IST
Highlights

రైల్వే మహిళా కానిస్టేబుళ్లు మానవత్వం చాటుకున్నారు. పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ రైల్వే స్వీపర్ కు స్వయంగా పురుడు పోశారు. తల్లీ బిడ్డా క్షేమంగా ఉన్నారు. 

రాజస్థాన్ : రాజస్థాన్లో ఓ అరుదైన ఘటన వెలుగు చూసింది.  పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ రైల్వే స్వీపర్ కు నలుగురు ఆర్పీఎఫ్ మహిళా కానిస్టేబుళ్లు కలిసి ప్రసవం చేశారు. ఈ ఘటన గురువారం రాజస్థాన్ లోని అజ్మీర్ రైల్వేస్టేషన్లో వెలుగు చూసింది. అక్కడ పనిచేస్తున్న పూజ అనే స్వీపర్ నిండు గర్భిణి.  ప్లాట్ ఫామ్ ను శుభ్రం చేస్తుండగా ఆమెకు ఒకసారిగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో  నొప్పులతో విలవిల్లాడిపోయింది. దీన్ని అక్కడే విధుల్లో ఉన్న ఆర్పీఎఫ్  కానిస్టేబుల్ వీరేంద్ర సింగ్ గమనించి ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ప్రేమారావుకు విషయం తెలిపాడు.

దీంతో కాసేపటికే మహిళా కానిస్టేబుల్ అయిన సావిత్రి ఫాగేడియా, హంస కుమారి, లక్ష్మీవర్మలతో పాటు మరికొంతమంది అక్కడికి చేరుకున్నారు. అప్పటికే నొప్పులు ఎక్కువ అవ్వడంతో పూజ ఆరోగ్య పరిస్థితి క్షీణించడం ప్రారంభించింది. రక్తస్రావం మొదలయ్యింది. ఆస్పత్రికి తీసుకువెళ్లడానికి కూడా సమయం లేదని అర్థమయింది.  దీంతో వెంటనే నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఓ దుప్పటిని అడ్డుపెట్టి.. పూజకు ప్రసవం చేశారు. పూజ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం తల్లి బిడ్డలను స్థానిక సాటిలైట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిపారు. మహిళా కానిస్టేబుల్ ల కృషిని అభినందించారు. 

33 యేళ్ల క్రితం అదృశ్యమై.. 75యేళ్ల వయసులో ఇంటికి.. ఎక్కడికి వెళ్లాడటా అంటే..

ఇదిలా ఉండగా ఇలాంటి ఘటనే మే16న కర్నాటక లో జరిగింది. కర్ణాటక హసన్‌లో బస్సులో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆ మహిళ శిశువుకు జన్మనివ్వడంలో కెఎస్‌ఆర్‌టిసి మహిళా కండక్టర్ సహకరించింది. బస్సులో పురిటినొప్పులు మొదలవ్వడంతో.. బస్సును ఓ పక్కకు ఆపారు. ప్రసవానికి ముందు ఇతర ప్రయాణీకులందరూ సురక్షితంగా దిగినట్లు కండక్టర్ నిర్ధారించారు.

తరువాత, సదరు గర్భణీ మహిళ ఆర్థికంగా వెనుకబడిన నేపథ్యం గలదని గుర్తించి ఆమెకు ఆర్థిక సహాయం అందించడానికి బస్సు సిబ్బంది, ప్రయాణికుల నుండి రూ.1,500 వసూలు చేశారు. ఈ సంఘటన బస్ నెం. చిక్కమగళూరు డిపోకు చెందిన KA 18 F 0865 బస్సులో చోటు చేసుకుంది. 

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెడితే.. బెంగళూరు నుంచి చిక్కమగళూరు వెళ్తున్న బస్సులో హాసన్‌లోని ఉదయపుర వ్యవసాయ కళాశాల సమీపంలో మధ్యాహ్నం 1.25 గంటల ప్రాంతంలో ఓ మహిళకు పురిటి నొప్పులు వచ్చాయి. సమీపంలో ఆసుపత్రి లేకపోవడంతో, లేడీ కండక్టర్ ఎస్ వసంతమ్మ బస్సును ఆపి, మొత్తం 45 మంది ప్రయాణికులను దించి, బస్సులోనే ఆడబిడ్డను ప్రసవించేలా గర్భిణికి సౌకర్యం కల్పించారు.

అనంతరం మహిళను శాంతగ్రామ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం చిన్నారి, మహిళ ఆరోగ్యంగా ఉన్నారు.
కెఎస్ఆర్టీసీ సిబ్బంది సకాలంలో అందించిన సహాయాన్ని జి సత్యవతి, ఎండీ అభినందించారు.
 

click me!