దొంగనే పోలీసులకు ఫిర్యాదు చేసిన వైనం.. కత్తితో బెదిరించి చోరీకి యత్నం.. జనం చితక్కొట్టడంతో కేసు

By telugu teamFirst Published Sep 5, 2021, 7:50 PM IST
Highlights

కర్ణాటకలోని బెంగళూరులో దొంగతనానికి ప్రయత్నించి విఫలమై ప్రజల చేతిలో దాడికి గురైన ఓ 18ఏళ్ల దొంగ వారందరిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగ ఫిర్యాదు ఆధారంగా వారందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. క్యాబ్ డ్రైవర్ నుంచి మొబైల్ ఫోన్, నగదు చోరీ చేయడానికి ఆ దొంగ ప్రయత్నించారు. క్యాబ్ డ్రైవర్ చేసిన ఫిర్యాదుపైనా కేసు నమోదైంది.
 

బెంగళూరు: కర్ణాటకలో విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. 18ఏళ్ల ఓ దొంగ కత్తితో బెదిరించి ఓ క్యాబ్ డ్రైవర్ నుంచి మొబైల్ ఫోన్, నగదును చోరీకి యత్నించాడు. కానీ, ఆ ప్రయత్నం విఫలం కావడం, చుట్టూ ఉన్న జనం చితక్కొట్టడం చకచకా జరిగిపోయాయి. దీంతో ఆ దొంగనే జనంపై కేసు పెట్టారు. తనపై దాడి చేసిన వారిపై చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కర్ణాటక రాజధాని బెంగళూరులో 18ఏళ్ల దొంగ జయకుమార్ ఓ క్యాబ్ డ్రైవర్ చెంతకు చేరి డబ్బులు ఇవ్వాలని బెదిరించాడు. కానీ, ఆ క్యాబ్ డ్రైవర్ దొంగను బలంగా వెనక్కి నెట్టాడు. వెంటనే సహాయం కోసం అరిచాడు. అక్కడే ఉన్న జనం అప్రమత్తమై ఆ దొంగపై పిడిగుద్దులు కురిపించారు. అయితే, దొంగ వారినందరి నుంచి తప్పుకుని పారిపోవడానికి కత్తి తీసి బెదిరించాడు. దొంగ ఎత్తు చిత్తయింది. చాకచక్యంగా వ్యవహరించడంతో ఆ చర్యకు దొంగ మరింత జనాగ్రహానికి లోనుకావాల్సి వచ్చింది. కొందరు హెల్మెట్‌తో, మరొకరు కర్రతో బాదినట్టు దొంగ ఆరోపించారు. సుమారు 30 నుంచి 40 మంది దొంగను చుట్టిముట్టినట్టు తెలిపారు.

దొంగతనానికి ప్రయత్నించిన జయకుమార్‌పై క్యాబ్ డ్రైవర్ కేసు పెట్టారు. ఈ కేసు ఆధారంగా పోలీసులకు దొంగను పట్టుకున్నారు. పోలీసులకు చిక్కిన తర్వాత ఆ దొంగ వారిపై రివర్స్ కేసు పెట్టారు. తనపై 30 నుంచి 40 మంది దాడి చేశారని, తల, పెదవులు, కాళ్లు చేతులకు గాయాలయ్యాయని ఆరోపించారు. గుర్తుతెలియని వారందరిపై తనను బాదినందుకు చట్టబద్దమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు గుర్తుతెలియని వారిపైనా దొంగ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. ఏదైనా ఫిర్యాదు అందినప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పోలీసుల బాధ్యత అని ఓ పోలీసు అధికారి తెలిపారు. నిందితులను పట్టుకోవడంలో ప్రజలు సహకరించాలని, ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. క్యాబ్ డ్రైవర్ ఫిర్యాదుతో జయకుమార్‌పై కేసు ఫైల్ అయింది.

click me!