రైతుల ఆందోళనకు బీజేపీ ఎంపీ మద్దతు.. అన్నదాతలతో మరోసారి చర్చించాలని కేంద్రానికి సూచన

By telugu teamFirst Published Sep 5, 2021, 5:33 PM IST
Highlights

బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ రైతు ఆందోళనలకు మద్దతునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మరోసారి వారితో గౌరవప్రదంగా చర్చించాలని సూచించారు. వారంతా ‘మన రక్తమాంసాలే’ అంటూ రైతులను పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో రైతులు ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ వీడియోను జతచేస్తూ ఆయన రైతులకు మద్దతునిస్తూ ట్వీట్ చేశారు.
 

న్యూఢిల్లీ: గతేడాది నవంబర్‌లో పంజాబ్‌లో మొదలైన రైతుల ఆందోళన దావానలంలా దేశమంతటా పాకింది. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో ఆందోళనలు ఇప్పటికీ ఉధృతంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం గతేడాది తెచ్చిన మూడు నూతన సాగు చట్టాలను ఉపసంహరించుకోవాలని, కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ సరిహద్దులో రైతుల ఆందోళన అందరి దృష్టిలో పడింది. ఇప్పటికీ ఆందోళనలు ఆగకుండా సాగుతున్నాయి. కాగా, నూతన సాగు చట్టాలను దేశంలోని చాలా రాష్ట్రాల ప్రజలు ఆమోదించారని పేర్కొంటూ ఈ ఆందోళనలను కేంద్రం కొట్టిపారేసే యత్నం చేసింది. వారితో పలుసార్లు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, బీజేపీ ఎంపీ రైతు ఆందోళనలకు మద్దతునివ్వడం సంచలనంగా మారింది.

కాబోయే కేంద్ర మంత్రి అంటూ పేరున్న యూపీకి చెందిన బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ తాజాగా రైతు ఆందోళనలకు మద్దతునిచ్చారు. ‘ముజఫర్ నగర్‌లో లక్షలాది రైతులు కలిసి ఆందోళనలు చేశారు. వారంతా మన రక్తమాంసాలే. వారితో గౌరవప్రదంగా మరోసారి చర్చించాల్సిన అవసరముంది. వారి బాధను అర్థం చేసుకోవాలి. సమస్యను వారి కోణంలో చూడాలి. వారితో కలిసి ఏకాభిప్రాయం ఏర్పరుచుకోవాల్సిన అవసరముంది’ అంటూ ఆయన ఓ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌కు ఈ రోజు యూపీలో జరుగుతున్న రైతు ఆందోళన వీడియోనూ జతచేశారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రైతులు పెద్దఎత్తున ఆందోళన చేపట్టడం రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నది. ఈ తరుణంలో బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వారికి మద్దతుగా ట్వీట్ చేశారు.

పిలిభిత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ కాబోయే కేంద్ర మంత్రి అంటూ విశ్లేషణలుండేవి. కానీ, ప్రధానమంత్రి ఇటీవలే చేపట్టిన కేంద్ర మంత్రివర్గం ప్రక్షాళనలో ఆయనకు చోటుదక్కలేదు.

click me!