1948లో పాక్ నుంచి కశ్మీర్‌ను రక్షించిన డకోటాలు: మాజీ ఎయిర్‌ కమాండర్ ఎంకే చంద్రశేఖర్

By sivanagaprasad kodatiFirst Published Oct 7, 2018, 11:20 AM IST
Highlights

భారతీయ వాయుసేనలో పురాతన డకోటా విమానం తిరిగి సేవలు అందించనుంది. వీపీ905 పరశురామ పేరుతో అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గోనుంది. 

భారతీయ వాయుసేనలో పురాతన డకోటా విమానం తిరిగి సేవలు అందించనుంది. వీపీ905 పరశురామ పేరుతో అక్టోబర్ 8న జరిగే ఎయిర్‌ఫోర్స్ ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గోనుంది. ఆ రోజు డకోటాతో కలిపి మొత్తం 28 ఎయిర్‌క్రాఫ్ట్‌లు ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఫ్లైపాస్ట్ కార్యక్రమంలో డకోటా పాల్గొనడం ఇదే ప్రథమం.. టైగర్‌మథ్, పురాతన హార్వార్డ్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లు కూడా ప్రదర్శనలో పాల్గొంటాయి.

ఘజియాబాద్‌లోని హిండాన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఇవే ప్రత్యేక ఆకర్షణ కానున్నాయి. దీని అసలు పేరు డగ్గస్ డీసీ3.. కానీ ‘ డకోటా ’గా ప్రసిద్ధి చెందింది. తొలిసారిగా 1930లో రాయల్ ఇండియన్ ఎయిర్‌‌ఫోర్స్‌లోని 12వ స్క్వాడ్రన్‌లో ప్రవేశపెట్టారు. 1940లలోఎయిర్‌ఫోర్స్‌లో తురపుముక్కగా పనిచేసిన డకోటాను మొదటి సిక్ రెజిమెంట్‌కు చెందిన సైనికులను 1947 అక్టోబర్ 27న శ్రీనగర్‌కు చేర్చారు. ఆనాటి యుద్ధంలో ఫూంచ్ సెక్టార్ పాకిస్తాన్ పరం కాకుండా కాపాడటంలో డకోటాదే కీలకపాత్ర అని నేటికి చెబుతారు.

అయితే కాలం చెల్లిన తర్వాత 2011లో యుద్ధ విమానాల తుక్కులో ఈ విమాన శకలాలు చూసిన కర్ణాటకకు చెందిన బీజేపీ శాసనసభ్యుడు రాజీవ్ చంద్రశేఖర్‌కు తన తండ్రి మాజీ ఎయిర్ కమాండర్ ఎంకే చంద్రశేఖర్‌ పైలట్‌గా ఉన్న స్మృతులు గుర్తొచ్చి వెంటనే దీనిని కొనుగోలు చేశారు. అనంతరం బ్రిటన్‌కు చెందిన రీఫ్లయిట్ ఎయిర్ వర్క్స్ లిమిటెడ్‌ను సంప్రదించి..మళ్లీ పునర్వినియోగించేలా మరమ్మత్తులు చేయించి అనంతరం భారత వాయుసేనకు బహుమతిగా ఇచ్చారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో బ్రిటన్ నుంచి 4800 నాటికల్ మైళ్లు ప్రయాణించి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు చేరుకుంది. యుద్ధ విమానం కావడంతో ఇతర దేశాల నుంచి ప్రతిఘటన రాకుండా ఉండేందుకు గాను.. ఇదే ప్రయాణించే ఫ్రాన్స్, ఇటలీ, గ్రీస్, ఈజిప్ట్, ఒమన్ తదితర దేశాల నుంచి ముందుగానే అనుమతి తీసుకున్నారు.. భారత్‌కు చేరుకున్న అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని హిందాన్ ఎయిర్‌బేస్‌కు తరలించారు. అక్కడ జరిగిన కార్యక్రమంలో ఎయిర్‌చీఫ్ మార్షల్ బీఎస్ ధనోవాకు రాజీవ్ చంద్రశేఖర్ అప్పగించారు.

మా నాన్న ‘‘ డకోటా ’’ విమానాన్ని నడిపారు. ఆ విమానాన్ని ఆయన నడుపుతుండగా ఎంతో ఉద్వేగం చెందేవారని.. ఆ వాతావరణంలోనే తాను పెరిగానని.. అందుకే మా నాన్న చేతుల మీదుగానే డకోటాను వాయుసేనకు అప్పగించాలని నిర్ణయించాను అని రాజీవ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాజీవ్ చంద్రశేఖర్ తండ్రి, మాజీ ఎయిర్ కమాండర్ ఎంకే చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘మా కాలంలో డకోటా ఒక్కటే ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ అని.. ఆర్మీకి ఇదే తొలి ఎయిర్‌క్రాఫ్ట్ అని చెప్పారు. ఆ రోజున స్థానికులు, పాకిస్థాన్ ఉగ్రవాదులు కలిసి ప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన సమయంలో సైనికులను శ్రీనగర్‌లో దించామని తెలిపారు. ఆ రోజు డకోటా కనుక లేకపోయుంటే జమ్ముకశ్మీర్.. పాకిస్తాన్ వశమయ్యేదని ఆ నాటి స్మృతులు నెమరువేసుకున్నారు. 

click me!