కరోనా దెబ్బ: దేవత చెప్పిందని గ్రామం ఖాళీ, ప్లేగ్ సమయంలో కూడ ఇలాగే...

By narsimha lodeFirst Published Apr 13, 2020, 11:18 AM IST
Highlights
:కరోనా నేపథ్యంలో మూడు రోజుల పాటు గ్రామంలో ఎవరూ కూడ ఉండకూడదని గ్రామ దేవత ఆదేశించిందనే కారణంగా ముద్దనహళ్లి గ్రామాన్ని ఖాళీ చేశారు గ్రామస్తులు
బెంగుళూరు:కరోనా నేపథ్యంలో మూడు రోజుల పాటు గ్రామంలో ఎవరూ కూడ ఉండకూడదని గ్రామ దేవత ఆదేశించిందనే కారణంగా ముద్దనహళ్లి గ్రామాన్ని ఖాళీ చేశారు గ్రామస్తులు. 

కరోనాను పురస్కరించుకొని దేశ వ్యాప్తంగా ఈ నెల 14వ తేదీ వరకు లాక్ డౌన్ ను విధించింది కేంద్రం.  కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ను ఈ నెల 30వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగించిన విషయం తెలిసిందే.

అయితే కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లాలోని కొరటిగెరె తాలుకాలోని ముద్దనహళ్లి గ్రామస్తులు మూడు రోజుల పాటు ఇళ్లను ఖాళీ చేసి గ్రామానికి వెలుపల టెంట్లు వేసుకొని  ఇంటి వెలుపల ఉంటున్నారు.

ఈ గ్రామంలో సుమారు 60 కుటుంబాలు నివాసం ఉంటాయి. గ్రామ దేవత మారమ్మ ఆదేశం మేరకు ఈ గ్రామానికి చెందిన 60 కుటుంబాలు శుక్రవారం నాడు మధ్యాహ్నం నుండి గ్రామానికి వెలుపల టెంట్లలో నివాసం ఉంటున్నారు. ఆదివారం నాడు సాయంత్రం వీరంతా తమ గ్రామానికి చేరుకొన్నారు.

గ్రామస్తులను ఇళ్లకు వెళ్లాలని అధికారులు సూచించినా కూడ వారు వెళ్లలేదు. గ్రామానికి చెందిన పెద్దల నేతృత్వంలో పశువులు, తమ పెంపుడు జంతువులను తమతో పాటు తీసుకొని గ్రామ సరిహద్దుకు చేరుకొన్నారు.

తమ పొలాలు, లేదా ప్రభుత్వ భూముల్లో గ్రామస్తులు టెంట్లు వేసుకొని అక్కడే వంటలు చేసుకొని మూడు రోజుల పాటు గడిపారు. 

కొరటగెరె తాలుకా తహసీల్దార్ బిఎం గోవిందరాజ్ పోలీసులతో కలిసి గ్రామాన్ని సందర్శించి తమ తమ ఇళ్లకు వెళ్లాలని ప్రజలను కోరారు. కానీ, ప్రజలు మాత్రం అధికారుల మాటలను పట్టించుకోలేదు.

తహసీల్దార్, పోలీసులు గ్రామానికి వచ్చిన తర్వాత కొందరు టెంట్లు వదిలి ఇళ్లకు చేరుకొన్నారు. అయితే అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఇళ్లకు వెళ్లినవారంతా తిరిగి టెంట్ల వద్దకు చేరుకొన్నారని గ్రామానికి చెందిన అంజనప్ప చెప్పారు.
also read:మద్యం ప్రియులకు శుభవార్త.. నేటి నుంచి తెరచుకోనున్న దుకాణాలు

ప్లేగు వ్యాధి ప్రబలిన సమయంలో కూడ తమ గ్రామానికి చెందిన వారు గ్రామానికి దూరంగా నివాసం ఉన్నట్టుగా తమ పూర్వీకులు చెప్పిన విషయాన్ని గ్రామస్థులు గుర్తు చేసుకొంటున్నారు.

మూడు రోజుల పాటు గ్రామాన్ని ఖాళీ చేయాలని తమ మంచి కోరి మారెమ్మ దేవత చెప్పిన విషయాన్ని గ్రామస్తులు చెబుతున్నారు. అందుకే ఈ విషయాన్ని కచ్చితంగా అమలు చేస్తున్నామన్నారు.ప్లేగ్ వ్యాధి వ్యాపించిన సమయంలో కూడ ఇదే తరహాలో గ్రామాన్ని వదిలి వెళ్లినట్టుగా తమ పూర్వీకులు చెప్పారని గ్రామస్తులు కొందరు గుర్తు చేసుకొన్నారు.

 
click me!