ప్రైవేటు కంపెనీల్లోనూ స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని హర్యానా ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పంజాబ్ హర్యానా హైకోర్టు కొట్టివేసింది.
న్యూఢిల్లీ: పంజాబ్ హర్యానా హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు వెలువరించింది. హర్యానాలోని మనోహర్ లాల్ ఖట్టర్ ప్రభుత్వం ప్రైవేటు రంగంలో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలన్న చట్టాన్ని తెచ్చింది. తాజాగా హైకోర్టు ఈ చట్టాన్ని కొట్టేసింది. స్థానిక నివాస సర్టిఫికేట్ ఉన్నవారికి ప్రవేటు రంగంలో 75 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందేనన్నది రాష్ట్ర ప్రభుత్వ చట్టం. ఈ చట్టాన్ని రద్దు చేస్తూ న్యాయమూర్తులు జీఎస్ సంధావాలియా, హర్‌ప్రీత్ కౌర్‌ల ధర్మాసనం నిర్ణయం తీసుకుంది.
గుర్గావ్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ సహా పలు పారిశ్రామిక సంఘాలు హర్యానా ప్రభుత్వం తెచ్చిన స్థానికులకు 75 శాతం కోటా చట్టాన్ని సవాల్ చేస్తూ పంజాబ్ హర్యానా హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు చేశారు. తాజాగా, ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషనలు విచారించింది.
హర్యానా స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ యాక్ట్ 2020 ప్రకారం జీతం 30 వేలకు తక్కువగా ఉండే ప్రైవేటు కంపెనీల్లోని ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్ ఉండాలి. ఈ చట్టం ప్రైవేట్ కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులు, భాగస్వామ్య సంస్థలకూ వర్తిస్తుంది. ఈ చట్టం పదేళ్ల వరకు అమల్లో ఉంటుంది. ఈ చట్టంపై పారిశ్రామిక సంఘాలు, పరిశ్రమల యాజమాన్యాలు తీవ్ర వ్యతిరేకత చూపించాయి.
Also Read: Password: మీ పాస్‌వర్డ్‌ను సెకన్లలో హ్యాక్ చేయొచ్చు.. ఇదే చాలా కామన్ పాస్‌వర్డ్
ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధమైనదని ఇండస్ట్రీ బాడీలు హైకోర్టులో వాదించాయి. వ్యాపార సంస్థలు మెరిట్‌లపై ఆధారపడి ఉద్యోగాలు నియమించుకుంటాయని ప్రాథమిక సూత్రాన్ని ఈ చట్టం ఉల్లంఘిస్తున్నదని, ప్రైవేటురంగంలో పోటీకి ఇది తప్పనిసరి అని పేర్కొన్నాయి. ఈ చట్టం ఉత్పాదకతను, పారిశ్రామిక పోటీని ప్రభావితం చేస్తుందని వివరించాయి.
ఈ చట్టం కేవలం భౌగోళిక తేడాను మాత్రమే చూపిస్తుందని, దీనికి రాజ్యాంగంలో ఆమోదం ఉన్నదని హర్యానా ప్రభుత్వం వాదించింది. అయితే, పంజాబ్ హర్యానా హైకోర్టు హర్యానా ప్రభుత్వ వాదనను అంగీకరించలేదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.