ఉత్తరప్రదేశ్‌లో బాలికల నుంచి అండాలను చట్టవిరుద్ధంగా సేకరించి వ్యాపారం చేసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. ఓ ముఠా పేద కుటుంబాల బాలికను టార్గెట్ చేసుకుని అండాలను సేకరించి సంతానం లేని దంపతులకు ఐవీఎఫ్ సెంటర్ వేదికగా అందజేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
వారణాసి: కొందరు దుండగులు మైనర్ బాలిక నుంచి అండాలను సేకరించి వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అండాలను పిల్లలు లేని దంపతులకు అమ్ముకుంటున్నారు. ఐవీఎఫ్ సెంటర్ కేంద్రంగా ఈ వ్యవహారం జరుగుతున్నట్టు పోలీసులు గుట్టు రట్టు చేశారు.
ఆ ముఠా బాలికలకు ప్రలోభాలు చెప్పి చెప్పు చేతల్లోకి తీసుకుంటుంది. వారి వయసు 23 సంవత్సరాల కంటే ఎక్కువ అని చూపే నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తారు. వాటిని చూపి ఆ మైనర్ బాలికల నుంచి అండాలను సేకరిస్తారు. ఇందుకోసం పెద్ద మొత్తంలో ఆ బాలికలకు ఆశచూపుతారు. వీరు పేద కుటుంబాలకు చెందిన బాలికలనే టార్గెట్ చేసుకుని ఈ వ్యవహారం చేపడుతున్నారు. ఇందుకు సంబంధించి నలుగురు నిందితులను వారణాసిలో అరెస్టు చేసినట్టు పోలీసులు శుక్రవారం వెల్లడించారు.
జైత్‌పురా ఏరియాకు చెందిన 17 ఏళ్ల బాలిక పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఒక ఫేమస్ ఐవీఎఫ్ సెంటర్ కేంద్రంగా ఈ వ్యవహారం జరుగుతున్నదని మహిళా పోలీసు స్టేషన్ ఇంచార్జీ నికితా సింగ్ తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. నవపురాకు చెందిన సీమా దేవి, ఆమె భర్త ఆశిశ్ కుమార్, భేలుపూర్ పోలీసు స్టేషన్ ఏరియాకు చెందిన అనితా దేవి, సోన్‌భద్రకు చెందిన అన్మోల్ జైస్వాల్‌లను అరెస్టు చేశారు.
ఎగ్స్ డొనేట్ చేస్తే రూ. 30 వేలు ఇస్తామని ఆ ముఠా హామీ ఇచ్చిందని, కానీ, రూ. 11,500 మాత్రమే ముట్టజెప్పిందని బాలిక తల్లి ఆరోపించింది. ఈ విషయం మొత్తం బాలికకు తెలియకుండానే జరిగిందని వివరించింది.
ఈ వ్యవహారంలో కొందరు ఉద్యోగులు, వైద్యుల ప్రమేయం కూడా ఉన్నట్టు తెలుస్తున్నది.
అండం దానం చేయడానికి కొన్ని నిర్దిష్ట షరతులు ఉన్నాయి. దాత మహిళ వయసు 23 ఏళ్లకు మించి ఉండాలి. ఆమెకు అప్పటికే పెళ్లై ఉండాలి. కనీసం మూడేళ్ల సంతానం ఉండాలి. ఒక మహిళ ఆమె జీవిత కాలంలో ఒకే సారి అండం దానం చేయవచ్చు అని ఓ సీనియర్ అధికారి వివరించారు.