కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ బీజేపీ ఆదేశాల‌తోనే రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారు.. : సీపీఐ(ఎం)

Published : Sep 20, 2022, 03:11 PM IST
కేర‌ళ గ‌వ‌ర్న‌ర్ బీజేపీ ఆదేశాల‌తోనే రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తున్నారు.. : సీపీఐ(ఎం)

సారాంశం

Arif Mohammed Khan: కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ బీజేపీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారని సీపీఐ(ఎం) ఆరోపించింది. అలాగే, ఆయ‌న రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించింది.  

Kerala: బీజేపీ,ఆర్‌ఎస్‌ఎస్‌ సూచనల మేరకు  కేర‌ళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించారని రాష్ట్ర అధికార పార్టీ  సీపీఐ(ఎం) మంగళవారం ఆరోపించింది. అలాగే, ఆయ‌న రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని విమ‌ర్శించింది. సోమ‌వారం నాడు రాజ్‌భవన్‌లో గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ విలేకరుల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి పినర‌య్ విజయన్‌తో సహా కేరళలోని రాజకీయ నాయకులు ఆయనపై విరుచుకుపడ్డారు. త్రిసూర్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) చీఫ్ మోహన్ భగవత్‌తో గవర్నర్ సమావేశమైన ఒకరోజు తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) ఎంపీ బినోయ్ విశ్వం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు లేఖ రాస్తూ గవర్నర్ రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

కేరళలో బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ విధానాలను అమలు చేసేందుకు గ‌వ‌ర్న‌ర్ ఆరిఫ్ మ‌హ‌మ్మ‌ద్ ఖాన్ ప్రయత్నిస్తున్నారని స్థానిక స్వపరిపాలన మంత్రి ఎంబి రాజేష్, రాష్ట్ర మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఐజాక్ ఆరోపించారు. గత కొన్ని రోజులుగా ఆయ‌న న‌డుచుకుంటున్న తీరు దీనికి నిద‌ర్శ‌నంగా ఉంద‌ని పేర్కొన్నారు. కర్నాటక, గోవా వంటి ఇతర రాష్ట్రాల్లో చేసినట్లుగా, వామపక్ష ఎమ్మెల్యేలను తమలో చేరేందుకు బెదిరించలేమని, కొనుగోలు చేయలేమని బీజేపీకి తెలుసునని, అందుకే ఇక్కడ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని రాజేష్ ఆరోపించారు.

ఐజాక్ మాట్లాడుతూ.. "బీజేపీయేతర ప్రభుత్వం ఎక్కడ ఉంటే.. గవర్నర్‌ను ఉపయోగించి ఆయా రాష్ట్రాల్లో సమస్యలు సృష్టిస్తున్నారనీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, తెలంగాణ, జార్ఖండ్‌లో అన్నింటిలోనూ ఇదే జరుగుతోందని అన్నారు. ఇప్పుడు కేర‌ళ‌లో కూడా అదే చేస్తున్నార‌ని" పేర్కొన్నారు. యూనివర్సిటీ చట్టం, లోకాయుక్త‌ సవరణ బిల్లులకు గవర్నర్‌ ఆమోదం తెలపకుండా నిలుపుదల చేయడం, వాటిని చూడకుండా సంతకం చేయనని ముందుగానే చెప్పడం ముందస్తు ఆలోచనా ధోరణిని సూచిస్తోందన్నారు. గవర్నర్ ప్రవర్తన చూస్తే ఆయన ఎవరి కోసం పనిచేస్తున్నారు, రిమోట్ కంట్రోల్ ఎక్కడ ఉందో తెలియజేస్తోందని రాజేష్ వ్యంగాస్త్రాలు సంధించారు. గవర్నర్‌ను ఉపయోగించుకుని ఆర్‌ఎస్‌ఎస్ ఈ రాజ్యాంగ సంక్షోభాన్ని సృష్టిస్తోందని ఆయన అన్నారు. గవర్నర్ తన పదవిని, అధికారాలను అర్థం చేసుకోవాలని ఐజాక్ సూచించారు. 

కేబినెట్ సలహా మేరకు తాను నడుచుకుంటారనీ.. కానీ కేరళకు తానే రాజు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. అది ఆమోదయోగ్యం కాదని.. రాజకీయంగా ఎదుర్కోవడమే సమస్యకు పరిష్కారమని ఆయన అన్నారు. "ఎన్నికైన ప్రభుత్వం ఆమోదించిన బిల్లులపై సంతకం చేయననీ, దానిని తన జేబులో ఉంచుకుంటానని చెప్పడానికి అతను ఎవరు" అని ఐజాక్  ప్ర‌శ్నించారు. కాగా, 2019లో కన్నూర్ యూనివర్శిటీలో తనపై జరిగిన ఆరోపణలు, ముఖ్యమంత్రి పినరయి విజయన్ తనకు పంపిన లేఖల వీడియో క్లిప్‌లను విడుదల చేయడానికి ఖాన్ రాజ్‌భవన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించిన ఒక రోజు తర్వాత ఇద్దరు సీపీఐ(ఎం) నేతలు స్పందిస్తూ పై వ్యాఖ్య‌లు చేశారు. కన్నూర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నియామకం అంశంపై గవర్నర్ ఖాన్ మాట్లాడుతూ, కేరళ ప్రభుత్వం తన అధికారాలను తగ్గించడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం రాజ్ భవన్ పై ఒత్తిడి తీసుకువ‌స్తున్న‌ద‌ని తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్