
Prime Minister Narendra Modi: ఈశాన్య భారతంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీకి త్వరలో ఎన్నికలు జరగున్నాయి. ఈ క్రమంలోనే అక్కడ వివిధ పార్టీలకు చెందిన నాయకుల ఎన్నికల ర్యాలీలతో రాజకీయాలు హీటెక్కాయి. ఎన్నికల ప్రచారంలో పాలుపంచుకున్న ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ ఏటీఎంలుగా ఉపయోగించుకుంటున్నదని ఆరోపించారు. అలాగే, ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా నాగాలాండ్ ను కాంగ్రెస్ పాలించిందని విమర్శించారు.
ఫిబ్రవరి 27న జరిగే నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం చుముకెడిమా జిల్లాలో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. నాగాలాండ్ కోసం బీజేపీ మంత్రం- శాంతి, పురోగతి, శ్రేయస్సు అనీ, అందుకే బీజేపీపై ప్రజలకు విశ్వాసం పెరుగుతోందని ప్రధాని మోడీ అన్నారు. బీజేపీ టెక్నాలజీ సాయంతో ఈశాన్య రాష్ట్రాల్లో అవినీతిని అరికట్టిందన్నారు. పీఎం కిసాన్ సమన్ నిధి పథకం కింద ప్రజలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని తెలిపారు. నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ-ఎన్డీపీపీ సంయుక్త బహిరంగ సభలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు.
PM Modi arrives at Agri Expo Centre Ground in Dimapur, to address a joint public rally of BJP-NDPP ahead of the Nagaland Assembly elections. CM Neiphiu Rio is also present pic.twitter.com/fagndOn8Kw
ఎన్నికల ర్యాలీకి ముందు నాగాలాండ్ ముఖ్యమంత్రి నీఫియు రియో దిమాపూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకునీ, సన్మానించారు. బీజేపీ-ఎన్డీపీపీలు ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నాయి.
Nagaland CM Neiphiu Rio felicitates PM Narendra Modi ahead of his public address, in Dimapur pic.twitter.com/fIs2IxvzRQ
ఢిల్లీలోని కాంగ్రెస్ నేతలు నాగాలాండ్ వైపు ఎప్పుడూ చూడలేదనీ, రాష్ట్రంలో సుస్థిరత, శ్రేయస్సుకు ఎప్పుడూ ప్రాధాన్యం ఇవ్వలేదని మోడీ విమర్శించారు. కాంగ్రెస్ ఎప్పుడూ నాగాలాండ్ ప్రభుత్వాన్ని ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్ లో నడిపేదని ఆరోపించారు. ఢిల్లీ నుంచి దిమాపూర్ వరకు కాంగ్రెస్ కుటుంబ రాజకీయాలకు పాల్పడిందన్నారు.
నాగాలాండ్ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారని చెప్పారు. నేడు కేంద్ర ప్రభుత్వం నాగాలాండ్ లో వేలాది కుటుంబాలకు ఉచితంగా రేషన్ ఇస్తోందని తెలిపారు. ఈశాన్యంలోని 8 రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ మాదిరిగా ఏటీఎంలుగా పరిగణించకపోవడమే ఇందుకు కారణమని అన్నారు. మాకు 8 ఈశాన్య రాష్ట్రాలు 'అష్ట లక్ష్మి' అని పేర్కొన్న ఆయన అధికార పార్టీ చేసిన పనులను వివరించారు. కోహిమాను రైల్వేలతో అనుసంధానించడానికి జరుగుతున్న నిర్మాణ ప్రాజెక్టును ప్రధాని మోడీ ప్రస్తావించారు. టూరిజం నుంచి టెక్నాలజీ, స్పోర్ట్స్ నుంచి స్టార్టప్స్ వరకు నాగాలాండ్ యువతకు ప్రభుత్వం సాయం చేస్తోందన్నారు. హింసారహితంగా ఎన్నికలు నిర్వహించేందుకు త్రిపుర ప్రజలు సహకరించారని కొనియాడారు. ఇన్నేళ్ల తర్వాత త్రిపురలో ఎన్నికలకు సంబంధించిన హింసాత్మక ఘటనలు చోటుచేసుకోలేదు. దీనికి కారణం బీజేపీ ప్రభుత్వమేనని తెలిపారు.