దేశ రాజధానిలో ఘనంగా పింగళి వెంకయ్య 141వ జయంతి వేడుకలు.

First Published Aug 4, 2018, 10:27 AM IST
Highlights

జాతీయ సమైక్యతా సమగ్రతలను పాటిస్తూ దేశాభివృద్ధికి కంకణ బద్ధులు కావడమే శ్రీ పింగళి వెంకయ్యకు మనం అర్పించే ఘనమైన నివాళి అని  వెంకయ్య నాయుడు ఉద్భోదించారు.    

జాతీయ పతాక రూప శిల్పి, భారతదేశ ముద్దుబిడ్డ, స్వాతంత్ర సమరయోధుడు శ్రీ పింగళి వెంకయ్య తెలుగువాడు కావడం మనకెంతో గర్వకారణమని వారి ఆశయ సాధనకు మనమంతా పునరంకితం కావాలని భారత గౌరవ ఉపరాష్ట్రపతి  వెంకయ్య నాయుడు ఉద్ఘాటించారు.  జాతీయ సమైక్యతా సమగ్రతలను పాటిస్తూ దేశాభివృద్ధికి కంకణ బద్ధులు కావడమే శ్రీ పింగళి వెంకయ్యకు మనం అర్పించే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు

స్వాతంత్ర సమరయోధుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి, బహుభాషా కోవిదుడు జాతీయ పతాక రూప శిల్పి శ్రీ పింగళి వెంకయ్య 141వ జయంతిని పురస్కరించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీ లోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ డా. బి.ఆర్. అంబెడ్కర్ ఆడిటోరియం లో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా  జాతీయ పతాక రూప శిల్పి  పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  

అనంతరం. వెంకయ్య నాయుడు  మాట్లాడుతూ యావత్ ప్రపంచం గర్వించ దగిన మహోన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి  పింగళి వెంకయ్య అని కొనియాడారు.  కృష్ణా జిల్లా భట్లపెనుమర్రు గ్రామంలో జన్మించిన పింగళి వెంకయ్య  తన విద్యార్థి దశ నుంచే దేశ సమైఖ్యత స్వాతంత్ర సముపార్జనపై ఉన్నత ఆశయాలు కలిగి ఉన్నారన్నారు.   నిరాడంబరతకు నిదర్శనం  పింగళి వెంకయ్య జీవితమని గుర్తు చేశారు.  

స్వాతంత్రోద్యమంలో విద్యార్థి దశ నుంచే చురుకైన పాత్ర పోషించిన పింగళి వెంకయ్య మహాత్మా గాంధీజీ కి చేరువయ్యారని గుర్తు చేశారు.  జాతీయ సమైక్యత, శాంతి సౌబ్రాతృత్వాలకు నిదర్శనంగా కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులతో త్రివర్ణ పతాకాన్ని రూపొందించిన మహనీయుని స్మరించుకొనడం మనందరి కర్తవ్యం అని వెంకయ్యనాయుడు అన్నారు.  మహనీయులను గుర్తు చేస్తూ ఇటువంటి మహోన్నతమైన కార్యక్రమాలను దేశ రాజధానిలోని ఆంధ్ర ప్రదేశ్ భవన్ లో ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.    

కేంద్ర సమాచార కమీషనర్ ఆచార్య మాడభూషి శ్రీధరాచార్యులు కార్యక్రమానికి అధ్యక్షత వహించి మాట్లాడుతూ 'జండా ఉంచా రహే హమారా' కవితా గానం స్వాతంత్ర ఉద్యమంలో ప్రజలను ఎంతో ఉత్తేజ పరచింది అని అటువంటి ఉత్తేజానికి గుర్తింపుగా జాతి గర్వం, గౌరవానికి నిదర్శనంగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారని అన్నారు.  నిరాడంబరుడు, నిగర్వి జాతీయ స్ఫూర్తికి అకుంఠిత దీక్ష తో కృషి చేసిన మహనీయుడని పేర్కొన్నారు

ఆంధ్ర ప్రదేశ్ భవన్ రెసిడెంట్ కమీషనర్ ప్రవీణ్ ప్రకాష్ మాట్లాడుతూ  పింగళి వెంకయ్య జీవితం మనందరికీ అనుసరణీయమని అన్నారు.అనంతరం పింగళి వెంకయ్య చారిటబుల్ ట్రస్ట్ ముఖ్య కార్యనిర్వహణాధికారిణి శ్రీమతి జగదాంబ మాట్లాడుతూ  పింగళి వెంకయ్యకు భారత రత్న ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 

ఈ కార్యక్రమములో శ్రీ పింగళి వెంకయ్య మునిమనమరాలు శ్రీమతి సుశీల, పారిశ్రామిక వేత్త రాజు భాటి పాల్గొన్నారు. శ్రీ పింగళి వెంకయ్య జయంతి వేడుకలను పురస్కరించుకుని వివిధ పాఠశాలలలోని విద్యార్థిని, విద్యార్థులకు నిర్వహించిన వివిధ పోటీలలో ప్రతిభను కనపరచిన వారికి జ్ఞాపికలు, ప్రశంశాపత్రాలను అందచేశారు.  కార్యక్రమానంతరం డా. శ్రీమతి రమణిగిరి శిష్య బృందం ఆంధ్రనాట్యం నృత్య రూపకాన్ని ప్రదర్శించారు.    
 

click me!