
రాజకీయ పార్టీలకు వివిధ రకాలుగా విరాళాలు అందుతాయన్న విషయం తెలిసిందే. అయితే.. పలు ప్రాంతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలోనే (పేరు తెలియని మూలాలు)కోట్లకు కోట్లు అందుతున్నాయట. ఈ విషయాన్ని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) నివేదిక ద్వారా వెల్లడైంది. గత ఆర్థిక సంవత్సరం(2021-22)లో ప్రాంతీయ పార్టీలకు గుప్త విరాళాల రూపంలో ₹ 887.55 కోట్లు వచ్చినట్టు వచ్చినట్టు తెలిపింది. ఇది ఆ పార్టీల మొత్తం విరాళాల్లో 76 శాతంగా ఉన్నట్టు (ADR) తెలిపింది. ఇక, 2020-21లో ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం ₹ 530.70 కోట్లుగా ఉండగా.. ఇందులో ₹ 263.93 కోట్లు (49.73 శాతం) గుప్త విరాళాల రూపంలో వచ్చినట్టు నివేదిక పేర్కొంది.
ADR నివేదిక ప్రకారం ₹ 20,000 కంటే ఎక్కువ విరాళాలు ఇచ్చిన వారి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ వివరాలను ఆయా పార్టీలు భారత ఎన్నికల సంఘానికి (ECI) సమర్పించాయి. అదే సమయంలో గుప్త విరాళాలకు సంబంధించిన లెక్కలను ఆడిట్ రిపోర్టులో ప్రకటించినప్పటికీ పార్టీలు వాటి వివరాలను మాత్రం ఇవ్వలేదని ADR పేర్కొంది. అదే సమయంలో ₹ 20,000 కంటే తక్కువ ఇచ్చే వ్యక్తులు లేదా సంస్థల పేరు, ఎలక్టోరల్ బాండ్ల ద్వారా విరాళం ఇచ్చిన వారి పేరును వెల్లడించాల్సిన అవసరం లేదు. ఎలక్టోరల్ బాండ్‌లు, కూపన్‌ల విక్రయాలు, రిలీఫ్ ఫండ్‌లు, ఇతర ఆదాయాలు, స్వచ్ఛంద విరాళాలు రూపంలో గుప్త విరాళాలు వస్తున్నాయని ADR పేర్కొంది. అటువంటి స్వచ్ఛంద విరాళాల దాతల వివరాలు పబ్లిక్ డొమైన్‌లో అందుబాటులో లేకపోవడం గమనార్హం.
2021-22 ఆర్థిక సంవత్సరంలో తెలియని మూలాల నుండి రాజకీయ పార్టీలకు ₹ 887.55 కోట్ల విరాళాలు రాగా.. ఇది మొత్తం విరాళాలలో 76.15 శాతం అని ADR తెలిపింది. ఇందులో ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ప్రాంతీయ పార్టీలకు ₹ 827.76 కోట్లు (93.26 శాతం)అందినట్టు తెలిపింది. అలాగే.. కూపన్ల విక్రయం ద్వారా ₹. 38.35 కోట్లు (4.32 శాతం ), స్వచ్ఛంద విరాళాలుగా ₹ 21.29 కోట్లు ( 2.40 శాతం) చేకూరాయి. అలాగే.. దేశంలో ఉన్న 54 ప్రాంతీయ (గుర్తింపు పొందిన) పార్టీలను పరిగణించారు. అయితే, వారిలో 28 మంది మాత్రమే తమ వార్షిక ఆడిట్ మరియు కంట్రిబ్యూషన్ రిపోర్టులను దాఖలు చేయగా, మిగిలిన పార్టీలు రెండు నివేదికల్లో ఒకటి మాత్రమే సమర్పించాయి.
2021-22 ఆర్థిక సంవత్సరంలో 27 ప్రాంతీయ రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం ₹ 1,165.58 కోట్లు కాగా, తెలిసిన దాతల నుండి రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం ₹ 145.42 కోట్లుగా అందాయి. ఇది విలువ వారి మొత్తం ఆదాయంలో 12.48 శాతం అని నివేదిక పేర్కొంది. సభ్యత్వ రుసుములు, బ్యాంక్ వడ్డీ, ప్రచురణల విక్రయం, పార్టీ లెవీ మొదలైన ఇతర తెలిసిన వనరుల నుండి రాజకీయ పార్టీల మొత్తం ఆదాయం ₹ 132.61 కోట్లు లేదా మొత్తం ఆదాయంలో 11.38 శాతం అని ADR పేర్కొంది.