
Rahul Gandhi: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మే 31న వారం రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజులపాటు ఆయన పర్యటన సాగునున్నది. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ జూన్ 4న న్యూయార్క్‌లోని మాడిసన్ స్క్వేర్ గార్డెన్‌లో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీంతో పాటు కాలిఫోర్నియాలోని ఓ యూనివర్శిటీలో జరిగే కార్యక్రమానికి కూడా రాహుల్ హాజరుకానున్నారు.
రాహుల్ గాంధీ గత విదేశీ పర్యటనపై చర్చనీయాంశమైంది. మార్చిలో కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్లిన ఆయన ఈ సందర్భంగా ప్రజాస్వామ్యం, మైనారిటీల సమస్యలపై కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో విద్యార్థులతో మాట్లాడిన రాహుల్.. పార్లమెంట్‌లో మా మైక్ స్విచ్ ఆఫ్ అయిందని అన్నారు. అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం సంస్థలపై నిరంతరం ఒత్తిడి తెస్తోందని పేర్కొన్నారు.
పార్లమెంటులో దుమారం
కేంబ్రిడ్జి యూనివర్శిటీలో రాహుల్ గాంధీ ప్రసంగం తర్వాత పార్లమెంటులో తీవ్ర దుమారం చెలరేగింది. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బిజెపి , కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. మరోవైపు కాంగ్రెస్,ఇతర ప్రతిపక్ష పార్టీలు అదానీ గ్రూప్ వ్యవహారంపై జెపిసి విచారణకు డిమాండ్ చేస్తూనే ఉన్నాయి. దీంతో బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ కూడా జూన్ 22న అమెరికా వెళ్లనున్నారు. ఈ సందర్భంగా జూన్ 22న జరిగే ప్రత్యేక విందు కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరుకానున్నారు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్,ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈ పర్యటన జరుగుతోందని వెల్లడించింది.