ప్రేమ ఒప్పుకోలేదని.. యువతి గదిలో పెట్రోల్ పోసి, నిప్పు.. చికిత్స పొందుతూ మృతి.. జార్ఖండ్‌లో 144 సెక్షన్..

By Bukka SumabalaFirst Published Aug 29, 2022, 11:49 AM IST
Highlights

జార్ఖండ్‌లోని దుమ్కాలో 144 సెక్షన్‌ విధించారు. తన ప్రపోజల్ ను తిరస్కరించిందని 19 ఏళ్ల యువతికి నిప్పంటించాడు ఓ కిరాతకుడు. ఆ యువతి తీవ్ర గాయాలపాలై మరణించింది. ఆమె మృతికి న్యాయం చేయాలని కోరుతూ పెద్దఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. 

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ దారుణం వెలుగు చూసింది. తన ప్రేమను తిరస్కరించిందని ఓ 19 ఏళ్ల యువతికి నిప్పంటించాడో దుర్మార్గుడు. ఆ యువతి మంటలకు తీవ్ర గాయాలపాలై మరణించింది. మృతురాలికి న్యాయం చేయాలని కోరుతూ తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లా యంత్రాంగం సంబంధిత ప్రాంతంలో.. నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడడాన్ని నిషేధించే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (CrPC) సెక్షన్ 144ని విధించింది.

భారీ బందోబస్తు మధ్య యువతి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తరలించారు. బీజేపీ ఎంపీ సునీల్ సోరెన్ అంత్యక్రియలకు హాజరయ్యే అవకాశం ఉంది. దుమ్కా పట్టణంలో మంగళవారం నాడు షారుఖ్ అనే నిందితుడు యువతి నిద్రిస్తున్న సమయంలో.. ఆమె గది కిటికీ బయట నుంచి లోపలికి పెట్రోల్ పోసి నిప్పంటించాడని పోలీసులు తెలిపారు. 12వ తరగతి చదువుతున్న బాధిత విద్యార్థిని మొదట 90శాతం కాలిన గాయాలతో బయటపడింది. 

బిర్యానీ, మాంసం దుకాణాలు మూసెయ్యాల‌నే స‌ర్క్యూల‌ర్ ను వెన‌క్కి తీసుకున్న పోలీసులు.. అస‌లేం జ‌రిగిందంటే?

ఆమెను వెంటనే దుమ్కాలోని ఫూలో జానో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో చేర్చి, చికిత్స అందించారు. అప్పటికే ఆమె పరిస్తితి విషమంగా మారింది. దీంతో "ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటలకు రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతూ.. కాలిన గాయాలతో మహిళ మరణించింది" అని దుమ్కా టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నితీష్ కుమార్ తెలిపారు. నిందితుడిని ఇప్పటికే అరెస్టు చేసినట్లు తెలిపారు.

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్‌కు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం, నిందితులు 10 రోజుల క్రితం తన మొబైల్‌కు కాల్ చేసి తన ఫ్రెండ్ గా ఉండాలని వేధించాడని బాధితురాలు తెలిపింది. “సోమవారం రాత్రి 8 గంటల సమయంలో అతను మళ్లీ నాకు ఫోన్ చేసి, నేను అతనితో మాట్లాడకపోతే నన్ను చంపేస్తానని చెప్పాడు. ఈ బెదిరింపు గురించి వెంటనే మా నాన్నకు చెప్పాను. నాన్న, మంగళవారం అతడి కుటుంబంతో మాట్లాడతానని హామీ ఇచ్చాడు. దీంతో రాత్రి భోజనం చేసి నిద్రకు ఉపక్రమించాం. నేను నా గదిలో పడుకున్నాను”ఆమె చెప్పింది.

"మంగళవారం ఉదయం, నా వెన్నులో నొప్పి అనిపించింది. ఏదో కాలిపోతున్నట్లు అనిపించింది. నేను కళ్ళు తెరిచి చూసేసరికి అతను పారిపోతున్నాడు. వెంటనే ఏం జరిగిందో అర్థం కాలేదు. నేను నొప్పితో అరవడం మొదలుపెట్టాను. ఆ మంటలతోనే మా నాన్న గదిలోకి వెళ్ళాను. నా అరుపులకు మేల్కొన్న అమ్మానాన్న మంటలను ఆర్పి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు” అని పోలీసులు స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ యవతి చాలా కష్టంగా చెప్పుకొచ్చింది.

విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ కార్యకర్తలు దుమ్కా పట్టణంలోని దుధాని చౌక్ వద్ద ప్రదర్శన నిర్వహించి 19 ఏళ్ల యువతికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ డివిజనల్ పోలీస్ అధికారి విజయ్ కుమార్‌కు వినతి పత్రం సమర్పించారు. “శాంతిభద్రతలను కాపాడే ప్రయత్నంలో, దుమ్కా సబ్ డివిజన్‌లో సెక్షన్ -144 CrPC విధించబడింది. ముందస్తు అనుమతి లేకుండా ర్యాలీ, ప్రదర్శన, ఊరేగింపు అనుమతించబడదు" అని సబ్-డివిజనల్ ఆఫీసర్ మహేశ్వర్ మహ్తో తెలిపారు.

బీజేపీ ఎంపీ డాక్టర్ నిషికాంత్ దూబే ట్విట్ చేస్తూ “దుమ్కాలోని ఆ యువతిని మేము రక్షించలేకపోయాము. ముఖ్యమంత్రి, ఆయన వర్గీయులు పార్టీలు చేసుకుంటూనే ఉన్నారు. ఇప్పుడు సామాన్యులను జైలుకు పంపే ఆట సాగుతోంది. ఘోరమైన నేరాన్ని సీరియస్‌గా తీసుకోలేని ప్రభుత్వం ఎప్పటికీ సీరియస్‌గా తీసుకోదు’ అన్నారు. 

click me!