రియల్ హీరో.. గుండె నొప్పితో ప్రాణాలు పోతున్నా..చాకచక్యంతో 48 మందిని కాపాడిన బస్సు డ్రైవర్..

By Asianet News  |  First Published Oct 29, 2023, 1:52 PM IST

తన ప్రాణాలు పోతున్నా.. బస్సులో ఉన్న ప్రయాణికుల గురించి ఆలోచించి ఓ డ్రైవర్ రియల్ హీరోగా నిలిచారు. గుండెనొప్పితో అల్లాడిపోతున్నా బస్సును సురక్షితంగా నిలిపి, అందులో ఉన్న ప్రయాణికుల ప్రాణాలు కాపాడారు. 


అతడు ఓ బస్సు డ్రైవర్. విధుల్లో ఉండి, బస్సు నడుపుతున్న సమయంలోనే అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చింది. అయితే ఆ నొప్పిని భరిస్తూనే బస్సులో ఉన్న ప్రయాణికులను కాపాడేందుకు విశ్వప్రయత్నం చేశారు. చాకచక్యంగా బస్సును నెమ్మదిగా గోడకు ఢీకొట్టించి, దానిని నిలువరించాడు. కానీ ఆయన మాత్రం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్ లో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  కంధమాల్ లోని సారంగార్ నుంచి జి.ఉదయగిరి మీదుగా రాష్ట్ర రాజధాని భువనేశ్వర్ కు 'మా లక్ష్మి' అనే ప్రైవేటు బస్సు ప్రతిరోజూ రాత్రి సర్వీస్ సాగిస్తుంటుంది. ఎప్పటిలాగే శనివారం కూడా సారంగార్ నుంచి తన సర్వీస్ ప్రారంభించింది. డ్రైవర్ సనా ప్రధాన్ డ్రైవింగ్ చేస్తున్నారు. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. 

Latest Videos

undefined

అయితే బస్సు కంధమాల్ జిల్లాలోని పబురియా గ్రామానికి చేరుకోగానే సనా ప్రధాన్ కు ఒక్క సారిగా గుండె నొప్పి వచ్చింది. దీంతో అతడు బస్సు నడపలేని పరిస్థితి ఏర్పడింది. తీవ్ర నొప్పితో అల్లాడిపోతున్నా.. బస్సులో ఉన్న ప్రయాణికులకు ఏం కాకూడని, ఎంతో చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కన ఉన్న ఓ గోడకు నెమ్మదిగా ఢీకొట్టించాడు. దీంతో బస్సు ఆగిపోయింది. 

అనంతరం బస్సులో ఉన్న ప్రయాణికులు డ్రైవర్ పరిస్థితిని గమనించారు. వెంటనే సమీపంలోని ఆస్పత్రికి ఆయనను తరలించారు. కానీ అప్పటికే ఆయన మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారు. తీవ్రమైన నొప్పిలో కూడా ప్రయాణికుల ప్రాణాల గురించి ఆలోచించి డ్రైవర్ సనా ప్రధాన్ రియల్ హీరోగా నిలిచారు. 

కాగా.. కొంత సమయం తరువాత మరో డ్రైవర్ తో బస్సు ప్రయాణికులతో గమ్యస్థానానికి బయలుదేరింది. పోస్టుమార్టం అనంతరం ప్రధాన్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని తికబలి పోలీస్ స్టేషన్ ఇన్ చార్జి ఇన్ స్పెక్టర్ కల్యాణమయి సెంథా తెలిపారు. దర్యాప్తు ప్రారంభించినట్టు వెల్లడించారు. 
 

click me!