
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) రూ. 2 వేల నోట్లను చెలామణి నుంచి ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత పలు రకాల చర్చలు తెరమీదకు వచ్చాయి. భవిష్యత్తులో రూ. 500 నోట్లపై కూడా ఆర్‌బీఐ ఉపసంహరణ నిర్ణయం ప్రకటిస్తుందా?, తిరిగి రూ. 1,000 నోట్లను ప్రవేశపెడుతుందా? అనే ప్రశలు తలెత్తాయి. అయితే అలాంటిదేమి లేదని ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ గురువారం తెలిపారు. పోస్ట్ మానిటరీ పాలసీ బ్రీఫింగ్‌ను ఉద్దేశించి శక్తికాంత దాస్ మాట్లాడుతూ.. ప్రస్తుతానికి రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదా రూ. 1,000 డినామినేషన్ నోట్లను మళ్లీ ప్రవేశపెట్టే ఉద్దేశం లేదని అన్నారు. వాటిపై జరుగుతున్న ప్రచారం ఊహాగానాలు మాత్రమేనని అన్నారు.
‘‘ఆర్‌బీఐ రూ. 500 నోట్లను ఉపసంహరించుకోవడం లేదా రూ. 1,000 డినామినేషన్‌లో ఉన్న నోట్లను తిరిగి ప్రవేశపెట్టడం గురించి ఆలోచించడం లేదు. ఊహాగానాలు చేయవద్దని ప్రజలను అభ్యర్థిస్తున్నాను’’ అని శక్తికాంత్ దాస్ అన్నారు.
ఇదిలా ఉంటే, రూ. 2 వేల నోట్ల ఉపసంహరణపై గతంలో స్పందించిన శక్తికాంత దాస్.. ఆర్‌బీఐ 2000 రూపాయల నోట్లను తీసుకువచ్చిన ఉద్దేశ్యం నెరవేరిందని చెప్పారు. కరెన్సీ నిర్వహణలో భాగమే ఈ నిర్ణయం అని చెప్పారు. రూ. 2,000 కరెన్సీ నోట్లు చట్టబద్ధంగా కొనసాగుతున్నాయని దాస్ తెలిపారు. భారత కరెన్సీ నిర్వహణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని.. ఉక్రెయిన్‌లో యుద్ధం, పశ్చిమ దేశాలలోని కొన్ని బ్యాంకుల వైఫల్యం కారణంగా ఆర్థిక మార్కెట్లలో సంక్షోభం ఉన్నప్పటికీ మారకం రేటు స్థిరంగా ఉందని ఆయన అన్నారు.
‘‘అప్పుడు అమలులో ఉన్న రూ. 1000, రూ. 500 నోట్ల చట్టబద్ధమైన టెండర్ స్థితిని ఉపసంహరించుకున్నప్పుడు సిస్టమ్ నుండి తీసివేసిన డబ్బు విలువను త్వరగా తిరిగి నింపే ఉద్దేశ్యంతో రూ. 2000 నోట్లు ప్రాథమికంగా జారీ చేయబడినవని మా ప్రెస్ నోట్ లో స్పష్టంగా వివరించాం. ఆ ఉద్దేశ్యం నెరవేరింది.. ఈ రోజు సరిపడినన్ని నోట్లు, ఇతర డినామినేషన్ల చెలామణిలో ఉన్నాయి. 2000 రూపాయల నోట్ల చెలామణి కూడా 6, 73,000 కోట్ల గరిష్ట స్థాయి నుంచి దాదాపు 3, 62,000 కోట్లకు పడిపోయింది. చాలా రోజుల క్రితమే ప్రింటింగ్ కూడా ఆగిపోయింది.ఆ నోట్లు వాటి జీవిత చక్రాన్ని పూర్తి చేశాయి’’ అని శక్తికాంత దాస్ చెప్పారు.