ఆర్బీఐ మే నెలలో రూ. 2000 నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవాలని, వాటిని వ్యవస్థ నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 7వ తేదీతో గడువు ముగియగా.. ఇంకా రూ. 10, 000 కోట్ల విలువైన నోట్లు వ్యవస్థలోనే ఉన్నాయని తాజాగా ఆర్బీఐ గవర్నర శక్తికాంత దాస్ వెల్లడించారు. గడువు ముగిసినా ఆర్బీఐ ఆఫీసుల్లో మాత్రం వీటిని మార్చుకోవడానికి అవకాశం ఉన్నది.
న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ ఈ రోజు కీలక విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికీ రూ. 10,000 కోట్ల విలువైన రూ. 2000 నోట్లు వ్యవస్థలోనే ఉండిపోయాయని, ఇంకా వెనక్కి రాలేవని తెలిపారు. అయితే.. త్వరలోనే ఆ నోట్లు వెనక్కి వస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
‘రూ. 2000 నోట్లు ఇంకా వెనక్కి వస్తున్నాయి. కేవలం రూ. 10,000 కోట్ల విలువైన నోట్లు మాత్రమే ఇంకా వ్యవస్థలోనే ఉండిపోయాయి. అయితే, ఈ డబ్బులు కూడా వెనక్కి వస్తాయని విశ్వసిస్తున్నాను’ అని ఓ కార్యక్రమంలో పాల్గొన్న శక్తికాంత దాస్ మీడియాకు తెలిపారు.
ఈ నెల మొదట్లో రూ. 2000 నోట్ల గురించే మాట్లాడుతూ 87 శాతం నోట్లు డిపాజిట్ల రూపంలో బ్యాంకుల్లోకి వచ్చాయని చెప్పారు. మిగిలిన మొత్తం కౌంటర్‌లలో మార్పిడి చేసుకున్నారని తెలిపారు.
మే 19వ తేదీన క్లీన్ నోట్ పాలసీలో భాగంగా రూ. 2000 నోట్లను వ్యవస్థ నుంచి తొలగించాలనే నిర్ణయాన్ని వెల్లడించింది. సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ నోట్లను మార్చుకోవడానికి ప్రజలకు అవకాశాన్ని ఇచ్చింది. సెప్టెంబర్ 30వ తేదీ గడువు ముగిసినప్పుడూ ఈ అవకాశాన్ని అక్టోబర్ 7వ తేదీ వరకు పొడిగించింది.
Also Read: గజ్వేల్‌ను విడిచి ఎటూ పోను: సీఎం కేసీఆర్.. కామారెడ్డి పరిస్థితి?
అక్టోబర్ 8వ తేదీ నుంచి వ్యక్తిగతంగా ప్రజలు ఈ నోట్లను ఆర్బీఐ ఆఫీసుల్లో డిపాజిట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. దేశంలోని 19 చోట్ల ఆర్బీఐ ఆఫీసులు ఉన్నాయి. ఈ ఆర్బీఐ ఆఫీసులకు వెళ్లి రూ. 2000 నోట్లను ఏక కాలంలో రూ. 20 వేల వరకు ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. వారి బ్యాంకు ఖాతాల్లో ఈ నోట్లను డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి ఏమీ లేదు.