రేమండ్ గ్రూప్ అధినేత గౌతమ్ సింఘానియా తన భార్యతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ఆయన సోమవారం వెల్లడించారు. అయితే వారిద్దరూ విడిపోవడానికి కారణాలు మాత్రం ఆయన వెల్లడించలేదు.
Gautam Singhania : రేమండ్ గ్రూప్ అధినేత, బిలియనీర్ చైర్మన్ గౌతమ్ సింఘానియా దంపతులు విడిపోయారు. ఈ విషయాన్ని సింఘానియా సోమవారం అధికారికంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. 32 ఏళ్ల తన భార్య నవాజ్ మోడీతో విడిపోతున్నట్టు, ఇక నుంచి ఎవరి ప్రయాణాలు వారివే అని ఆయన ‘ఎక్స్’లో పోస్టు పెట్టారు. గత ఆదివారం దీపావళి సందర్భంగా నిర్వహించిన పార్టీకి రాకుండా భర్త తనను అడ్డుకున్నారని నవాబ్ చెబుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కొన్ని గంటల్లోనే ఈ పరిణామం చోటు చేసుకుంది.
నవంబర్ 12వ తేదీన థానేలోని గౌతమ్ సింఘానియాకు చెందిన జేకే గ్రామ్ లో దీపావళి పార్టీ జరిగింది. అయితే బయటకు వచ్చిన వీడియోలో సింఘానియా భార్యతో కాకుండా మరో మహిళతో గేటు వద్ద నిలబడి ఉన్నారు. అయితే కార్యక్రమానికి నవాజ్ మోడీని రాకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుకున్నారు. ఈ పార్టీకి తనకు అనుమతి ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డులు తనను అడ్డుకున్నారని వీడియోలో ఆమె ఆరోపించారు. మూడు గంటలకు పైగా తన కారులో వేదిక వెలుపల వేచి ఉండాల్సి వచ్చిందని నవాజ్ ఆ వీడియోలో పేర్కొన్నారు.
ఇక అప్పటి నుంచి సింఘానియా దంపతులు విడిపోతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. తాజాగా.. తాను, నవాజ్ ఇక కలిసి జీవించలేమని గౌతమ్ సింఘానియా సోమవారం ఎక్స్ లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ దీపావళి గతంలో మాదిరిగా ఉండదు. ఇకపై నవాజ్, నేను వేర్వేరు మార్గాలను అనుసరిస్తామని నా నమ్మకం. 32 ఏళ్లు జంటగా కలిసి ఉండటం, తల్లిదండ్రులుగా ఎదగడం, ఒకరికొకరు బలంగా ఉండటం కోసం మేము నిబద్ధత, సంకల్పం, విశ్వాసంతో ప్రయాణించాం. ఎందుకంటే మా జీవితంలో రెండు అత్యంత అందమైన చేర్పులు వచ్చాయి’’ అని పేర్కొన్నారు.
‘‘ఇటీవలి కాలంలో జరిగిన దురదృష్టకరమైన పరిణామాల చోటు చేసుకున్నాయి. ఈ నిరాధారమైన పుకార్లు, మా శ్రేయోభిలాషులు చేసినవి కావు. మా జీవితాల చుట్టూ అనేక పుకార్లు వ్యాపించాయి. కాబట్టి నేను ఆమెతో విడిపోతున్నాను. అదే సమయంలో మేము మా రెండు విలువైన వజ్రాలైన నిహారిక, నిసా కోసం ఉత్తమమైనవి చేస్తూనే ఉన్నాము.’’ అని పేర్కొన్నారు. కాగా.. వ్యక్తిగత నిర్ణయాల పట్ల గోప్యత, గౌరవం కల్పించాలని కోరారు. అయితే గౌతమ్ సింఘానియా మాత్రం తమ ఇద్దరు పిల్లల విడిపోవడం, కస్టడీకి సంబంధించిన వివరాలను వెల్లడించలేదు. గౌతమ్ సింఘానియా 1999లో న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని వివాహం చేసుకున్నారు.