
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఎయిమ్స్ డాక్టర్లు అరుదైన సర్జరీ చేశారు. గర్భంలోని శిశువుకు ప్రమాదకర హార్ట్ సర్జరీని విజయవంతంగా చేశారు.
తల్లి గర్భంలో ఉన్న ద్రాక్షపండు పరిమాణంలో ఉన్న చిన్నారి గుండెకు బెలూన్ డైలేషన్ చేసి విజయవంతం అయ్యారు. 28 యేళ్ల గర్భిణీకి ఈ చికిత్సతో ఆమె గర్భంలోని శిశువుకు సర్జరీ చేశారు. ఆమెకు అంతకు ముందు మూడుసార్లు అబార్షన్ అవ్వడంతో.. ఈసారి గర్భాన్ని కోల్పోదల్చుకోలేదు. దీంతో గర్భస్థశిశువుకు ఈ అరుదైన శస్త్రచికిత్సను చేశారు డాక్టర్లు.
వైద్యులు గర్భంలోని శిశువు గుండె పరిస్థితి గురించి తెలియజేశారు. అయితే తల్లిదండ్రులు శిశువును కోల్పోడానికి ఇష్టపడలేదు. ఏదైనా చికిత్స ఉంటే చేసి... గర్భస్థ శిశువును రక్షించాలని కోరారు. వారి కోరిక మేరకు ఎయిమ్స్‌లోని కార్డియోథొరాసిక్ సైన్సెస్ సెంటర్‌లో ఈ ప్రక్రియ జరిగింది. ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టులు, ఫీటల్ మెడిసిన్ నిపుణుల బృందం విజయవంతంగా ఈ ప్రక్రియను నిర్వహించింది.
ఎయిమ్స్ లోని ప్రసూతి అండ్ గైనకాలజీ విభాగం (ఫిటల్ మెడిసిన్)తో పాటు కార్డియాలజీ అండ్ కార్డియాక్ అనస్థీషియా విభాగానికి చెందిన వైద్యుల బృందం ప్రకారం, "ఈ ప్రక్రియ తర్వాత పిండం, తల్లి ఇద్దరూ బాగానే ఉన్నారు. వైద్యుల బృందాలు పిండం పెరుగుదలను పర్యవేక్షిస్తున్నాయి. గుండె గదులు చివరికి శిశువు భవిష్యత్తు నిర్వహణను నిర్ణయిస్తాం"..
ఇటుక బట్టీలో ఊపిరాడక ఐదుగురు కార్మికులు మృతి
"శిశువు తల్లి కడుపులో ఉన్నప్పుడు కొన్ని రకాల తీవ్రమైన గుండె జబ్బులను గుర్తించవచ్చు. కొన్నిసార్లు, వాటిని కడుపులో చికిత్స చేయడం వలన పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం మెరుగుపడవచ్చు. సాధారణ అభివృద్ధికి దారితీయవచ్చు" అని బృందం తెలిపింది. ఈ ప్రక్రియను శిశువు గుండెలో అడ్డుపడే వాల్వ్ బెలూన్ డైలేషన్ అంటారు.
ఈ ప్రక్రియ అల్ట్రాసౌండ్ మార్గదర్శకత్వంలో జరుగుతుంది, "శిశువు గుండెలోకి తల్లి కడుపు ద్వారా సూదిని గుచ్చి... తర్వాత, బెలూన్ కాథెటర్‌ని ఉపయోగించి, రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి మూసుకుపోయిన వాల్వ్‌ను తెరిచాం. శిశువు గుండె బాగా అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం. దీనివల్ల గుండె జబ్బులు పుట్టుకతో తక్కువగా ఉంటాయి" అని శస్త్రచికిత్స చేసిన సీనియర్ డాక్టర్ వివరించారు. అటువంటి ప్రక్రియ పిండం జీవితానికి ముప్పు కలిగిస్తుందని, చాలా జాగ్రత్తగా నిర్వహించాలని డాక్టర్ చెప్పారు.
"అయితే, ఈ ప్రక్రియ చాలా సవాలుతో కూడుకున్నది, ఎందుకంటే ఇది పిండం జీవితాన్ని కూడా ప్రమాదంలో పడేస్తుంది, ఇది చాలా ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిదీ అల్ట్రాసౌండ్ మార్గదర్శకత్వంలో చేయాలి. సాధారణంగా ఇలాంటివి యాంజియోగ్రఫీలో చేయాలి.. కానీ గర్భస్థ శిశువుకు ఇది చేయలేము. అందుకే అన్నీ అల్ట్రాసౌండ్ మార్గదర్శకత్వంలో చేయాలి. అంతేకాదు ఈ ప్రక్రియను చాలా త్వరగా పూర్తిచేయాలి. ఎందుకంటే గుండె ప్రధాన గదిని పంక్చర్ చేస్తున్నాం. కాబట్టి ఏదైనా తప్పు జరిగితే, శిశువు చనిపోతుంది, అందుకే ఈ ప్రక్రియను త్వరగా పూర్తిచేయాల్సి ఉంటుంది. అందుకే.. హృదయం దగ్గరికి వెళ్లాలి. డైల్యూషన్ చేయాలి.. వెంటనే రిటర్న్ అవ్వాలి.." అని ఎయిమ్స్ లోని కార్డియోథొరాసిక్ సైన్సెస్ సెంటర్‌కు చెందిన సీనియర్ డాక్టర్ చెప్పారు. "దీనికి పట్టిన సమయం కూడా తక్కువే.. కేవలం 90 సెకన్లు మాత్రమే పట్టింది" అన్నారాయన.