
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడక ముందే రాజకీయం వేడెక్కింది. రానున్న ఎన్నికల్లో గెలుపు కోసం అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రణాళికలు రచిస్తున్నాయి.ఈ క్రమంలోనే పలు ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. తాజాగా కర్ణాటకలో ప్రముఖ దినపత్రిక, ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ పబ్లిషర్ కన్నడ ప్రభ పేరుతో ఓ ఫేక్ సర్వే తెగ వైరల్‌గా మారింది. కర్ణాటకలో బీజేపీకి దిగ్భ్రాంతికరమైన ఓటమి ఎదురుకాబోతోందని ఆర్‌ఎస్‌ఎస్ నిర్వహించిన సర్వేలో వెల్లడైందని కన్నడ ప్రభ వార్తను ప్రచురించినట్టుగా ఆ పోస్టులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది. అయితే తాము అలాంటి కథనాన్ని ప్రచురించలేదని కన్నడ ప్రభ స్పష్టం చేసింది.
కన్నడ ప్రభకు ఆపాదిస్తూ ఉన్న నకిలీ సర్వేలో.. 224 సభ్యులు ఉన్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్ 115-120 సీట్లు గెలుస్తుందని, బీజేపీకి 65-70 సీట్లు వస్తాయని ఉంది. అయితే ఈ ఫేక్ సర్వే ప్రచారంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.
తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నవారిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టుగా ఏషియానెట్ న్యూస్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రాజేష్ కల్రా తెలిపారు. ‘‘ఆరెస్సెస్‌ను ఉద్దేశించి కన్నడప్రభలో ప్రచురితమైనదిగా చెబుతున్న ఈ సర్వే ఫేక్. అలాంటి సర్వే లేదు.. మేము అలాంటి వార్తలేమీ తీసుకురాలేదు. మేము సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నాము. మా బ్రాండ్ సూటిగా, ధైర్యంగా, అలుపెరుగని జర్నలిజంతో నిలుస్తుంది. అది ఎప్పటికీ రాజీపడదు’’ అని రాజేష్ కల్రా పేర్కొన్నాారు.
ఇక, కన్నడ ప్రభ అలాంటి వార్తను ప్రచురించలేదని ఎడిటర్ రవి హెగ్డే తెలిపారు. ఫేక్ రిపోర్టుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కన్నడ ప్రభ నిర్ణయించిందని రవి హెగ్డే స్పష్టం చేశారు.