
Uttar Dinajpur minor girl raped and murdered: ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేసిన దుండగులు, ఆ తర్వాత బాలిక ప్రాణాలు తీశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు-స్థానికుల మధ్య ఘర్షణకు దారి తీసింది. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచోసుకున్నాయి. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. పశ్చిమబెంగాల్ లోని కాళీగంజ్ లో మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకలం రేపింది. ఉత్తర దినాజ్ పూర్ జిల్లాలో శుక్రవారం జరిగిన ఈ ఘటనలో బాధితురాలి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని గంగువా గ్రామానికి చెందిన బాలిక గురువారం సాయంత్రం ట్యూషన్ కు వెళ్లి కనిపించకుండా పోయింది. బంధువులు, గ్రామస్తులు విస్తృతంగా గాలించినా రాత్రంతా ఆమె ఆచూకీ లభించలేదు. పోలీసులను ఆశ్రయించారు. అయితే, పెద్దగా స్పందనలు రాలేదని సమాచారం. అయితే, ఆ తర్వాతి రోజున బాలిక శవమై కనిపించింది. దీంతో ఆందోళనకు గురైన స్థానికులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో భారీగా బలగాలను మోహరించారు. స్థానికులు రోడ్డు దిగ్బంధం చేయడం, టైర్లను తగలబెట్టడం, పోలీసులపై రాళ్లు రువ్వడం వంటి చర్యలకు పాల్పడ్డారు. ఈ విధమైన పరిస్థితులు తలెత్తడానికి ప్రధాన కారణం బాధితురాలి మృతదేహాన్ని తరలించడానికి పోలీసులు ప్రవర్తించిన తీరుగా తెలుస్తోంది.
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయ షేర్ చేసిన వీడియోలో కొందరు పోలీసు అధికారులు బాధితురాలి మృతదేహాన్ని ఈడ్చుకెళ్తున్నారు. మైనర్ బాలిక రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందినదని పేర్కొన్నారు. "ఈ వీడియోలో, పశ్చిమ బెంగాల్ పోలీసులు ఇలా దారుణంగా లాక్కెళ్తున్న మృతదేహం ఉత్తర దినాజ్ పూర్ లోని కలియాగంజ్ లోని ఉంటున్న రాజ్బోంగ్షి కమ్యూనిటీకి చెందిన మైనర్ అత్యాచారం, హత్య బాధితురాలిది. సాక్ష్యాలను తొలగించడం లేదా నీరుగార్చడం, నేరాన్ని కప్పిపుచ్చడం లక్ష్యంగా ఉన్నప్పుడు ఇటువంటి తొందరపాటు తరచుగా కనిపిస్తుంది" అని మాలవీయ ట్వీట్ చేశారు.
In this video, the body West Bengal Police is insensitively dragging is that of a minor rape and murder victim from the Rajbongshi community in Uttar Dinajpur’s Kaliaganj. Such haste is often seen when the purpose is to eliminate or dilute evidence and cover up the crime… pic.twitter.com/zgz2Rxlik1
బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరిని అరెస్టు చేసినట్లు ఉత్తర దినాజ్ పూర్ పోలీసు సూపరింటెండెంట్ సనా అక్తర్ తెలిపారు. మైనర్ బాలిక మృతదేహం సమీపంలో విషంతో ఉన్న బాటిల్ దొరికిందని అక్తర్ తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారని, మరణానికి గల కారణాలను విశ్లేషించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేశామని తెలిపారు. బాధితురాలి శరీరంపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) పశ్చిమ బెంగాల్ పోలీసులను జోక్యం చేసుకుని నిష్పాక్షిక దర్యాప్తు జరిగేలా చూడాలని కోరింది. చేసిన ఆరోపణలు నిజమని తేలితే సంబంధిత సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కమిషన్ కోరింది.