
బీజేపీపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి నిప్పులు చెరిగారు. కొందరు వ్యక్తులు ద్వేషపూరిత రాజకీయాలు చేస్తూ దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని మమతా బెనర్జీ పేర్కొన్నారు. నగరంలోని రెడ్‌రోడ్‌లో ఈద్ ప్రార్థనల కోసం తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో విపక్షాలన్ని ఏకమై.. బీజేపీని ఓడించాలని కోరారు.
కొందరు దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తున్నారని, విద్వేష రాజకీయాలు చేస్తున్నారని ఆమె దుయ్యబట్టారు. నా ప్రాణాలనైనా ఇస్తాను కానీ, దేశ విభజనకు అనుమతించబోనని మమతా ఉద్ఘాటించారు. బీజేపీని అల్లరి పార్టీగా అభివర్ణించారు. పశ్చిమ బెంగాల్‌లో నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ అమలు చేయాలని భావిస్తున్నారని, ఆ విషయంలో తాము తలవంచబోమని అన్నారు. రాజకీయ లక్ష్యాలతో తమ పార్టీపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకుంటున్నాయని దీదీ ఆరోపించింది.
దేశ రాజ్యాంగాన్ని బీజేపీ మార్చడానికి ప్రయత్నిస్తోందని, పశ్చిమ్ బెంగాల్‌లో ఎన్ఆర్సీ అమలకు అనుమతించే ప్రసక్తేలేదని బెనర్జీ తేల్చిచెప్పారు. పొరుగు దేశాల నుంచి వారికి భారత పౌరసత్వం కల్పించే జాతీయ పౌర రిజిస్టర్, పౌరసత్వ సవరణ చట్టం అవసరం లేదని అన్నారు. పాక్, బంగ్లాదేశ్, అఫ్గన్ దేశాల నుంచి వలస వచ్చిన హిందువులు, సిక్కులు, బౌద్ధులకు మాత్రమే భారత పౌరసత్వం కల్పించేలా పౌరసత్వ చట్టాన్ని సవరించారని కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడి చేస్తుందనీ, కేంద్ర విధానాలకు వ్యతిరేఖంగా పోరాడటానికి తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. రానున్న ఎన్నికల్లో దేశాన్ని విచ్చిన్నం చేసే శక్తులకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాడాలని, వచ్చే ఎన్నికల్లో విపక్షాలన్ని ఒకే తాటిపైకి రావాలని బెంగాల్ సీఎం పిలుపునిచ్చారు. మమత మాట్లాడుతూ.. దేశంలో ఎవరు అధికారంలోకి రావాలో నిర్ణయించడానికి ఒక సంవత్సరంలో ఎన్నికలు వస్తాయనీ, సంఘటితమై విభజన శక్తులకు వ్యతిరేకంగా పోరాడుతామని హామీ ఇచ్చారు.