
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభలు సోమవారం నాడు ప్రారంభమయ్యాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, విభజన హమీల అమలుపై టీడీపీ, వైసీపీ ఎంపీలు సోమవారం నాడు నోటీసులు ఇచ్చాయి. అయితే ఈ అంశాలపై మంగళవారం నాడు చర్చిద్దామని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. దీంతో జీరో అవర్‌లో టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.తమ స్థానాల్లో కూర్చోవాలని రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు టీడీపీ ఎంపీలను కోరారు.
ప్రత్యేక హోదా, విభజన హమీ అంశాలపై చర్చించాలని కోరుతూ వైసీపీ, టీడీపీ ఎంపీలు సోమవారం నాడు రాజ్యసభలో నోటీసులు ఇచ్చాయి.
శనివారం నాడు రాజ్యసభ బీఏసీ సమావేశంలో ప్రత్యేక హోదాపై చర్దిద్దామని నిర్ణయం తీసుకొన్నారు. అయితే ఇవాళ రెండు పార్టీల ఎంపీలు పట్టుబట్టాయి. జీరో అవర్‌ను రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు కొనసాగించారు.
అయితే టీడీపీ ఎంపీలు రాజ్యసభ ఛైర్మెన్ పోడియం వద్దకు వచ్చి ఆందోళనను కొనసాగించారు.ఈ ఆందోళన కారణంగా జీరో అవర్ కొనసాగలేదు. జీరో సందర్భంగా పలువురు ఎంపీలు తమ సమస్యలను ప్రస్తావించే ప్రయత్నం చేశారు. అయితే టీడీపీ ఎంపీలు పోడియం వద్దకు వచ్చి ఆందోళన చేయడంతో సభ కార్యక్రమాలకు అంతరాయమేర్పడింది. దీంతో రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా వేస్తూ రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు నిర్ణయం తీసుకొన్నారు.