
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ లోని రాజౌరిలో బీజేపీ నేత ఇంటి మీద గ్రనేడ్ దాడి జరిగింది. ఈ దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందగా, ఆరుగురు గాయపడ్డారు. గురువారం రాత్రి ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. బీజేపీ నేత జస్బీర్ సింగ్, ఆయన తల్లిదండ్రులు, మరో ముగ్గురు బంధువులు గాయపడినట్టు తెలిపారు.
36 యేళ్ల సింగ్ తో పాటు ఆయన ఐదుగురు కుటుంబ సభ్యులు గాయపడగా, ఇద్దరిని చికిత్స కోసం జమ్మూ ఆస్పత్రికి తరలించనట్టు చెప్పారు. మృతుడిని జస్బీర్ మేనల్లుడిగా గుర్తించారు. దాడి విషయం తెలియగానే భద్రతా బలగాలు హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని ఆగంతకుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
కాగా, ఆగంతకుల గ్రైనేడ్ దాడిని బీజేపీ నేత తరుణ్ చుగ్ ఖండించారు. పాక్ ప్రేరేపిత టెర్రరిస్టులే ఈ దాడికి పాల్పడ్డారని, ఇది పిరికిపందల చర్య అని అన్నారు. దాడికి బాధ్యులైన వారిని తక్షణం పోలీసులు అరెస్ట్ చేయాలని బీజేపీ జేకే విభాగం నేత రవీందర్ రైనా అన్నారు.
అమాయక బాలుడి ప్రాణాలను పొట్టనపెట్టుున్నారని, ఆరుగురు గాయపడ్డారని, దాడికి పాల్పడిన వారు ఇందుకు తగిన మూల్యం చెల్లించుకోవాలని పేర్కొన్నారు. రాజకీయ నేతలు టార్గెట్ గా ఈ దాడులు జరుగుతున్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందులో భాగంగానే కశ్మీర్ లోయలోని అనంతనాగ్ లో ఒక బీజేపీ నేతను, అతని భార్యను దుండగులు నాలుగు రోజుల క్రితం కాల్చి చంపారు.