delta plus variant : ముంబైలో తొలి డెల్టా ప్లస్ మృతి, మహారాష్ట్రలో మూడుకు చేరిన మరణాలు

By AN TeluguFirst Published Aug 13, 2021, 3:55 PM IST
Highlights

ముంబైకి చెందిన ఆమెకి జూలై 21నే కరోనా పాజిటివ్ గా తేలింది.  అప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో చికిత్స తీసుకుంటున్న క్రమంలో జూలై 27న ఆమె చనిపోయారు. అయితే ఆమె టీకా రెండు డోసులు వేయించుకున్నారు.  అంతేగాకుండా ఆమె ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. 

ముంబై : దేశంలో కరోనా ఉదృతి తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. రకరకాల కరోనా వేరియంట్లు ఉనికి చాటుతూ హడలెత్తిస్తున్నాయి. కాగా తాజాగా ముంబైలో తొలి డెల్టా ప్లస్ మరణం చోటుచేసుకుంది. దీంతో ముంబై వాసులు భయాందోళనల్లో ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వృద్ధురాలు (63), జూలై 27న  ఈ వేరియంట్ బారినపడి ప్రాణాలు కోల్పోయారని వైద్యాధికారులు వెల్లడించారు.

ముంబైకి చెందిన ఆమెకి జూలై 21నే కరోనా పాజిటివ్ గా తేలింది.  అప్పటికే ఇతర అనారోగ్య సమస్యలు కూడా ఉండటంతో చికిత్స తీసుకుంటున్న క్రమంలో జూలై 27న ఆమె చనిపోయారు. అయితే ఆమె టీకా రెండు డోసులు వేయించుకున్నారు.  అంతేగాకుండా ఆమె ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేసిన దాఖలాలు లేవని అధికారులు తెలిపారు. 

ఇటీవల అందిన నివేదికల్లో మృతురాలితో సహా మరో ఇద్దరు కుటుంబ సభ్యుల్లో డెల్టా ప్లస్ వేరియంట్ వెలుగుచూసింది. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ఆ కుటుంబంలోని మిగతా సభ్యుల వివరాలు తెలియాల్సి ఉందని బీఎంసీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. తాజాగా నమోదైన మరణంతో కలిసి మహారాష్ట్రలో  ఇప్పటి వరకు రెండు డెల్టా ప్లస్ వేరియంట్ మరణాలు సంభవించాయి.  రత్నగిరికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు కొద్ది రోజుల క్రితం చనిపోయారు. ఆమె కూడా పలు అనారోగ్య సమస్యలతో బాధపడిందని అప్పట్లో అధికారులు తెలిపారు. ఈ డెల్టా ప్లస్ వేరియంట్ ను కేంద్రం ఇప్పటికీ ఆందోళనకరంగా గుర్తించిన సంగతి తెలిసిందే. 

కాగా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలోనూ  కరోనా డెల్టా ప్లస్ వేరియంట్ కారణంగా మరో మరణం చోటు చేసుకొంది. ఈ వైరస్ కారణంగా  రాష్ట్రంలో  ఏడు డెల్టా ప్లస్ కేసులు నమోదయ్యాయి.మధ్యప్రదేశ్ రాష్ట్రం నుండి 1,219 నుండి శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ డీసీజ్ కంట్రోల్ కు పంపారు. అయితే ఇందులో 31 శాతం నమూనాలు ఆందోళనకరంగా ఉన్నాయని ఎన్‌‌సీడీసీ ప్రకటించింది.

మధ్యప్రదేశ్‌లో నమోదైన 6 డెల్డా వేరియంట్‌ కేసులలో భూపాల్‌లో 2 కేసులు, ఉజ్జయినిలో 2 కేసులు, శివపూరి సమీపంలోని రైసన్‌, అశోక్‌నగర్‌ల నుంచి ఒక్కో డెల్టా వేరియంట్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ధృవీకరించింది.మన దేశంలో ఇప్పటి వరకు, 318 డెల్టా ప్లస్‌ వేరియంట్‌ కేసులు బయట పడ్డాయి. అదే విధంగా, యూకేలోని లండన్‌లో ఆల్ఫా వైరస్‌ రకానికి చెందిన 56 కేసులు నమోదయ్యాయి. డెల్టా ప్లస్  వేరియంట్ కేసులు నమోదైన ప్రాంతాల్లో కఠినమైన ఆంక్షలు అమలు చేసి వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.

click me!