కరెన్సీ నోటు చూపిస్తూ ‘నాతో వచ్చేయ్’ అని అడిగిన వ్యక్తికి జైలు

By telugu teamFirst Published Aug 13, 2021, 3:48 PM IST
Highlights

12 ఏళ్ల బాలికను కరెన్సీ నోటు చూపిస్తూ కన్ను కొడుతూ అసభ్యకరంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి ముంబయిలోని పోక్సో కోర్టు నాలుగేళ్ల శిక్ష విధించింది. నోటు చూపిస్తూ ‘నాతో వచ్చేయ్’ అనడం, కన్ను కొట్టడం వంటి చర్యలను లైంగిక వేధింపులుగా పరిగణించింది. 

ముంబయి: రోజువారీ జీవితంలో చాలా మంది యువతులు, మహిళలు లైంగిక వేధింపులు ఎదుర్కొంటుంటారు. కానీ, చాలా వరకు వాటిని పట్టించుకోకుండా తమ కార్యకలాపాల్లో నిమగ్నమవుతుంటారు. ముంబయికి చెందిన ఓ బాలిక అంతటితో ఆగలేదు. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దురుద్దేశంతోనే తనను చూసి సైగలు చేశాడని, అసభ్యకర వ్యాఖ్యలు చేశాడని నిరూపించింది. ఫలితంగా ఆ పోరంబోకుకు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది.

ముంబయికి చెందిన 12ఏళ్ల బాలికను మొహమద్ మన్సూరీ కొన్నాళ్లుగా తరుచూ వెంబడిస్తూ వేధించాడు. ఓ రోజు కన్నుకొట్టాడు. మరో రోజు రూ. 100 నోటు చేపిస్తూ ‘నాతో వచ్చేయ్’ అని సైగ చేశాడు. ఆ బాలిక ఇంటికెళ్లి బోరున విలపిస్తూ అమ్మకు జరిగిన విషయం చెప్పింది. ఆమె తన భర్తతో విషయం వివరించగా, వెంటనే బాలికను బయటకు తీసుకెళ్లాడు. మన్సూరీని వెతుక్కుంటూ సమీపంలోని మార్కెట్‌కు చేరారు. అక్కడ ఐస్ క్రీమ్ తింటూ కనిపించిన మన్సూరీని బాలిక చూపెట్టింది. అంతే, పరుగున వెళ్లిన తండ్రి మన్సూరీ చెంపచెల్లుమనిపించాడు. చుట్టూపక్కనున్నవారూ అమ్మాయిలను ఏడిపిస్తావా? అంటూ చితకబాదారు. తర్వాత పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి ఫిర్యాదు చేయగాఎఫ్ఐఆర్ నమోదైంది. 

ఈ ఘటన మార్చి 2017లో జరిగింది. అంతకుముందూ పలుసార్లు బాలికను మన్సూరీ ఏడిపించాడని తల్లి ఆరోపించింది. ఈ కేసులో మొహమద్ మన్సూరీని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఫిర్యాదను నగరంలోని ఓ పోక్సో కోర్టు విచారించింది. కేవలం లైంగికపరమైన వాంఛలు తీర్చుకోవాలనే ఉద్దేశంతోనే ఆ సైగలు చేశాడని కోర్టు భావిస్తున్నదని తెలిపింది. మన్సూరీని దోషిగా తేల్చింది. ఈ కేసులో మార్చి 2017లోనే మన్సూరీ అరెస్ట్ అయ్యాడు. అనంతరం బెయిల్ మీద 2018 జనవరిలో విడుదలయ్యాడు. పోలీసులకు అందుబాటులో లేకుండా పరారయ్యాడు. మళ్లీ 2018 మే నెలలో ఆచూకీ లభించగా పోలీసులు మళ్లీ అరెస్టు చేశారు. అప్పటి నుంచి జైలులోనే ఉన్నాడు.

ఈ కేసులో తుది తీర్పు వెలువరుస్తూ పోక్సో కోర్టు మన్సూరీకి సుమారు నాలుగేళ్ల జైలు శిక్షను విధించింది. ఇప్పటి వరకు జైలు శిక్ష అనుభవించినంత కాలం మరోసారి అనుభవించాలని ఆదేశించింది. బాధితురాలి ఫిర్యాదు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన తర్వాత ఇరుకుటుంబాల మధ్య గతంలో కక్షలు లేవని, మన్సూరీపై తప్పుడు ఆరోపణలు చేస్తారనడానికి తగిన కారణాలు లేవని కోర్టు తెలిపింది. బాలిక ఫిర్యాదు నమ్మదగినదిగా ఉన్నదని పేర్కొంది. ఆమె వాదనలను తోసిపుచ్చడానికి కారణాలేవీ లేవని వివరించింది. 2017 మార్చి 6న మన్సూరీ సదరు బాలికను కామ వాంఛల కోసమే వేధించాడని రూఢీ అవుతున్నదని వివరించింది.

click me!