రాజీవ్‌ గాంధీ హత్య: జైల్లో నళిని దంపతుల నిరాహార దీక్ష

By narsimha lodeFirst Published Feb 13, 2019, 3:05 PM IST
Highlights

తమను విడుదల చేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన  నళిని ఆమె భర్త మురుగన్ జైలులో నిరహారదీక్షకు దిగారు

చెన్నై: తమను విడుదల చేయాలని కోరుతూ మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులైన  నళిని ఆమె భర్త మురుగన్ జైలులో నిరహారదీక్షకు దిగారు. వేలూరు జైలులో శిక్షను అనుభవిస్తున్న మురుగన్ గత 12 రోజులుగా దీక్ష చేస్తున్నారు. శనివారం నుండి నళిని కూడ ఆమరణ దీక్షకు దిగింది.

రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్షను అనుభవిస్తున్న ఏడుగురు దోషులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఈ ప్రతిపాదనను తాము అంగీకరించబోమని కేంద్రం గతంలోనే సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పింది.  

తమని విడుదల చేయాలి లేదా కారుణ్య మరణానికి అనుమతించాలంటూ నళిని పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది పేర్కొన్నారు. ఈ మేరకు నళిని గవర్నర్‌ భన్వరీలాల్‌ పురోహిత్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

పరిస్థితుల ప్రభావం వల్ల ఈ కేసులో ఇరుక్కున్నట్టు నళిని చెబుతున్నారని న్యాయవాది చెప్పారు.. ఇక ఇప్పుడు నేను ఈ ప్రపంచం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకోవాలనుకుంటున్నాను. ఫిబ్రవరి 9 నుంచి నిరాహార దీక్ష చేపడతున్నాను. ఇలానైనా నాకు విముక్తి లభిస్తుందని నళిని లేఖలో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది వెల్లడించారు. 

రాజీవ్‌ హత్య కేసులో వారిని విడుదల చేసేందుకు తమిళనాడు గవర్నర్‌ చేస్తున్న జాప్యానికి వ్యతిరేకంగానే ఆమె దీక్ష చేస్తున్నారు. ప్రభుత్వం అనుమతినిచ్చినా ఆయన ఇందుకు సంబంధించిన కాగితాలపై సంతకం చేయడం లేదని న్యాయవాది  చెప్పారు.

1991, మే 21న ఎల్టీటీఈ సభ్యులు మానవ బాంబుతో మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ శ్రీ పెరంబూరులో ఎన్నికల ప్రచార సభలో చంపారు. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన చెన్నై టాడా కోర్టు 1998లో 26 మందిని దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. వీరిలో మురుగన్, సంతమ్, అరివు, జయకుమార్, రాబర్ట్‌ పయస్, పి.రవిచంద్రన్, నళిని ఉన్నారు.

ఆ తర్వాతి ఏడాది మురుగన్, సంతమ్, అరివు, నళినిల మరణశిక్షల్ని సుప్రీంకోర్టు సమర్ధించింది. ఈ కేసులోని జయకుమార్, రాబర్ట్‌ , రవిచంద్రన్‌ల శిక్షల్ని యావజ్జీవంగా మార్చింది. మిగిలిన 19 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది.

 2000లో యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీ విజ్ఞప్తితో తమిళనాడు గవర్నర్‌ నళిని మరణశిక్షను యావజ్జీవంగా మార్చారు. 2014, ఫిబ్రవరి 18న ఈ కేసును మరోసారి విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. మురుగన్, సంతమ్, అరివులకు విధించిన మరణశిక్షను కూడా యావజ్జీవంగా మార్చింది.


 

click me!