రాజీవ్ గాంధీ హత్య కేసు: జైలు నుంచి బయటకు వచ్చిన నళిని ఫస్ట్ కామెంట్ ఇదే.. ప్రజా జీవితంపై కీలక వ్యాఖ్య

By Mahesh KFirst Published Nov 12, 2022, 11:09 PM IST
Highlights

రాజీవ్ గాంధీ హత్య కేసులో విడుదలైన నళిని శ్రీహరన్ ఫస్ట్ కామెంట్ పై ఆసక్తి నెలకొంది. ఆమె తన తొలి మాటలో తనకు ఇది కొత్త జీవితం అని తెలిపారు. తన భర్త, కూతురితో ఈ కొత్త జీవితం ఉంటుందని వివరించారు. అంతేకానీ, పబ్లిక్ లైఫ్‌లో జాయిన్ అవ్వను అని చెప్పారు.
 

చెన్నై: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఆరుగురు దోషులు ఈ రోజు జైలు నుంచి విడుదలయ్యారు. వారిని విడిచిపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన తర్వాత వారిని తమిళనాడులోని వేలూరు సెంట్రల్ జైలు నుంచి విడుదల చేశారు. రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని శ్రీహరన్ పేరు ఎక్కువగా వినిపించింది. అందుకే ఆమె గురించిన ఆసక్తి కొంత ఎక్కువగా ఉన్నది. జైలు నుంచి విడుదలైన ఆమె చేసిన తొలి కామెంట్ పై చర్చ జరుగుతున్నది.

జైలు నుంచి బయటికి వచ్చిన తర్వాత నళిని తొలిసారి మీడియాతో మాట్లాడుతూ ‘ఇది నాకు కొత్త జీవితం. నా భర్త, కూతురితో నా కొత్త జీవితం. నేను ప్రజా జీవితంలో జాయిన్ కావడం లేదు. 30 ఏళ్లకు పైగా నాకు మద్దతుగా నిలబడిన తమిళులకు ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి నేను థాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను నా కూతురితో మాట్లాడాను’ అంటూ ఉద్వేగంగా స్పందించారు. ప్రజా జీవితంపై తనకు ఆలోచనలు లేవని స్పష్టం చేశారు. అలాగే, రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీని కలుస్తారా? అని ప్రశ్నించగా.. ఓరి దేవుడా.. లేదు లేదు అంటూ సమాధానం ఇచ్చారు.

Also Read: జైలు నుంచి విడుదలైన రాజీవ్ హంతకులు.. 30 ఏళ్ల తర్వాత బయటి ప్రపంచంలోకి

1991లో రాజీవ్ గాంధీ హత్య కేసులో దోషులుగా తేలిన నళిని శ్రీహరన్, మరో ఐదుగురిని విడుదల చేయాలని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నిర్ణయంపై కాంగ్రెస్ విమర్శించింది. కానీ, తమిళనాడు మాత్రం స్వాగతించింది. వీరిపై తమిళుల్లో సానుభూతి ఉన్నది. సానుకూలత ఉన్నది. ఒక పెద్ద కుట్రలో ఈ ఏడుగురిని భాగం చేశారని, అసలు అది ఎంత పెద్ద నేరమో వారికి తెలియదని, వారికి కేటాయించిన పనులు మాత్రమే వారు చేసి పెట్టారని తమిళులు భావిస్తారు. 

ఈ కేసులో దోషుల సత్ప్రవర్తనను ఆధారం చేసుకునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు తెలిపింది. ఇటీవలే (మే నెలలో) ఈ కేసు నుంచి ఏజీ పెరారివాలన్ విడుదల అయ్యాడు. ఈ సందర్భంగా ఆయననూ కోర్టు ప్రస్తావించింది. ఏజీ పెరారివాలన్ 30 ఏళ్లకు పైగా జైలు జీవితం అనుభవించాడని వివరించింది. అందులోనూ 29 ఏళ్లు ఏకాంత కారాగార వాసాన్ని అనుభవించారని తెలిపింది. ఆయన 19 ఏళ్ల వయసులో జైలుకు వెళ్లాడు.

Also Read: Rajiv Gandhi Case: రాజీవ్ గాంధీ హత్యకేసు టైమ్‌లైన్.. దోషి పెరరివాలన్ వాంగ్మూలాన్ని మార్చిన సీబీఐ మాజీ అధికారి!

తమిళనాడులోని శ్రీపెరుంబుదూర్‌లో 1991 మే నెలలో రాజీవ్ గాంధీ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తుండగా ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో రాజీవ్ గాంధీని లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం (ఎల్‌టీటీఈ) అనే శ్రీలంకన్ గ్రూప్ హతమార్చింది.

ఈ ఆత్మాహుతి దాడిని ఎల్‌టీటీఈ ప్రతీకార దాడిగా పేర్కొంటూ ఉంటారు. 1987లో శ్రీలంకకు ఎల్‌టీటీఈని అణచివేయడానికి రాజీవ్ గాంధీ ప్రభుత్వం ఇండియన్ పీస్ కీపర్స్‌ను పంపించింది. ఈ యుద్దంలో 1,200 మంది మరణించిన తర్వాత వారిని తిరిగి వెనక్కి పిలుచుకుంది. శ్రీలంకలో మానవ హక్కులను దారుణంగా హననం చేశారనే ఆరోపణల నేపథ్యంలో ఇండియన్ పీస్ కీపర్లను అప్పటి భారత కేంద్ర ప్రభుత్వం వెనక్కి రప్పించుకుంది.

click me!