
Rajasthan: రాజస్థాన్ లోని కోటలో నిర్వహిస్తున్న ఓ వసతి గృహంలో విషాదం చేసుకుంది. కలుషిత ఆహారం తిని ముగ్గురు చనిపోగా.. మరో 12 మంది తీవ్ర అస్వస్థతకు గురుయ్యారు. వివరాల్లోకెళ్తే.. కోటజిల్లాలోని స్థానికంగా ఉన్న పాలిటెక్నికల్ కళాశాల పాత భవనంలో ఓ ఎన్జీవో అప్నా ఘర్ పేరుతో ఓ ఆశ్రమాన్ని నిర్వహిస్తున్నది. అయితే గత రాత్రి.. భోజనం అనంతరం.. వసతి గృహంలో ఉంటున్న పలువురు ఆరోగ్యం క్షీణించడంతో వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ.. ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందిని స్థానిక మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చిక్సిత పొందుతున్నారు.
జిల్లా కలెక్టర్ ఓపీ వీవర్ మాట్లాడుతూ.. ఆహారం తీసుకున్న తర్వాత ఆశ్రమంలో నివసిస్తున్న వారు.. వాంతులు, విరేచనాలు అయినట్లు ఫిర్యాదు చేశారు. వీరిలో 15 మంది పరిస్థితి విషమంగా మారింది. వీరిని స్థానిక వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. అందులో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. మరో 12 మంది చికిత్స పొందుతున్నారు. మృతుల్లో మున్నీ బాయి (37), సుదేవి (36), దిలీప్ (56) ఉన్నారు.
ఘటనపై సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ ఓపీ వీవర్, ఏడీఎం బ్రిజ్‌మోహన్ బైర్వా, మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ సర్దానా, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ భూపేంద్ర సింగ్ తన్వర్, సామాజిక న్యాయ సాధికారత శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఓంప్రకాశ్ తోష్నివాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు.
కలెక్టర్ తనిఖీ సందర్భంగా ఆశ్రమంలో పలు పరిశుభ్రత లోపాలు బయట పడ్డాయి. ఇంతకు ముందు కూడా ఆశ్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు పలు ఫిర్యాదు అందాయి. యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ ఘటన జరిగినట్టు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఆశ్రమంలో ఉన్న రేషన్ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. దాని విచారణ తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటారు.