
న్యూఢిల్లీ: హర్యానాలోని లొహరులో ఓ కారు కాలిపోయిన ఘటనలో బజరంగ్ దళ్ పేరును రాజస్తాన్ ప్రభుత్వం అనసవరం ప్రస్తావిస్తున్నదని విశ్వ హిందు పరిషద్ సెంట్రల్ జాయింట్ జనరల్ సెక్రెటరీ డాక్టర్ సురేంద్ర జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. తప్పుడు ఆరోపణలను మానుకుని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హర్యానాలోని లొహరులో దురదృష్టకర ఘటనలో కారు కాలిపోయి కొందరు అగ్నికి ఆహుతయ్యారు. కొందరి అస్థికలను గుర్తించారు. కారు అనుకోకుండా ఆహుతయ్యిందా? లేక ఎవరైనా తగులబెట్టారా? అనేది దర్యాప్తులో తేలాల్సి ఉన్నది. ఆ కారు రాజస్తాన్‌కు చెందినది. ఆ కారులో అస్థికలు ఎవరివి అనేది కూడా దర్యాప్తు చేయాల్సి ఉన్నది. నిష్పాక్షిక దర్యాప్తులో తేలిన దోషులను తప్పకుండా శిక్షించాలి. ఇదే తమ స్పష్టమైన అభిప్రాయం అని సురేంద్ర జైన్ తెలిపారు.
రాజస్తాన్‌లోని భరత్ పూర్ జిల్లా నుంచి ఇద్దరు గో అక్రమ రవాణాదారులు కనిపించకుండా పోయారని ఆయన పేర్కొన్నారు. వారిపై ఇప్పటికే గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలతో పలు కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. కనిపించకుండా పోయిన ఇద్దరిలో ఒకరి తమ్ముడు బజరంగ్ దళ్‌కు చెందిన కొందరి ప్రముఖులపై అనుమానం ఉన్నదని, వారి పేర్లను పోలీసులకు చెప్పాడని తెలిపారు. ఈ ఘటనపై ప్రాథమిక దర్యాప్తైనా చేపట్టకుండా అతను అనుమానిస్తున్న వారే బాధ్యులని పోలీసులు భావిస్తున్నారని వివరించారు. ఈ ఘటనలో బజరంగ్ దళ్ నేతల పేర్లను అనవసరంగా తీసుకుంటున్నారని, ఇది దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఇలాంటి కేసుల్లో రాజస్తాన్ ప్రభుత్వం తీరును వారి ఓటు బ్యాంకు ప్రభావితం చేస్తుందని చూశామని తెలిపారు. అది వారి పొలిటికల్ అజెండా అని వివరించారు. కానీ, ఈ కేసులో బజరంగ్ దళ్ పేరును అనవసరం ప్రస్తావించడం ఏ రీతిలో సమంజసం కాదు స్పష్టం చేశారు.
రాజకీయ పక్షపాతంతో వ్యవహరించే రాజస్తాన్ ప్రభుత్వం నుంచి కూడా అక్కడి సమాజం న్యాయాన్ని ఆశించరు అని ఆయన తన ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే వీహెచ్‌పీ పలు డిమాండ్లు చేస్తున్నదని వివరించారు. ఈ ఘటనను సీబీతో దర్యాప్తు చేయించాలని, ఒక వ్యక్తి అనుమానిస్తున్నాడని పేర్లు చెప్పినందుకే వారిని దర్యాప్తు పూర్తి చేయకుండా అరెస్టు చేయరాదని డిమాండ్ చేశారు. అంతేకాదు, దర్యాప్తు పూర్తి చేశాక దోషులను కఠినంగా శిక్షించాలని, రాజస్తాన్ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.