
న్యూఢిల్లీ: బిలియనీర్ ఇన్వెస్టర్ జార్జ్ సోరోస్ భారత వ్యవహారాలపై వ్యాఖ్యానించడం దుమారం రేపింది. భారత బిజినెస్ టైకూన్ గౌతమ్ అదానీ స్టాక్ మార్కెట్ ట్రబుల్స్‌తో భారత ప్రజాస్వామ్యం పునరుజ్జీవనం చెందుతుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సమాధానం చెప్పాల్సి ఉన్నదని ఆయన ఇటీవలే ఓ కార్యక్రమంలో మాట్లాడారు. జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఖండించారు. ఆయన వ్యాఖ్యలు భారత దేశంపై దాడిగానే పరిగణించాలని అన్నారు. భారత ప్రజాస్వామిక ప్రక్రియలను జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించే విదేశీ శక్తులను ప్రతి భారతీయుడు కలిసికట్టుగా ఎదుర్కోవాలని పిలుపు ఇచ్చారు.
జార్జ్ సోరోస్ తన వ్యాఖ్యలతో భారత ప్రజాస్వామిక ప్రక్రియను ధ్వంసం చేయడానికి డిక్లరేషన్ ఇచ్చాడని స్మృతి ఇరానీ తెలిపారు. భారత అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించిన ఇలాంటి ఎన్నో విదేశీ శక్తులను భారతీయులు ఓడించారని, ఇక పైనా ఓడిస్తారని అన్నారు. జార్జ్ సోరోస్‌కు ప్రతి భారతీయుడు గట్టి బదులు ఇవ్వాలని పిలుపునిచ్చారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌ను బద్దలు కొట్టిన సోరోస్‌ను ఆ దేశం ఆర్థిక యుద్ధ నేరస్తుడిగా గుర్తించిందని, ఇప్పుడు అతను భారత ప్రజాస్వామ్యాన్ని నాశనం చేయాలని అవాకులు చెవాకులు పేలుతు న్నాడని మండిపడ్డారు. జార్జ్ సోరోస్‌కు అనుగుణంగా నడుచుకున్న ఏ రాజకీయ సంస్థ అయినా సరే భారత ఎన్నికల వ్యవస్థ ముందు దాని అసలు రూపాన్ని బయటపెట్టుకున్నట్టే అని పేర్కొన్నారు.
జార్జ్ సోరోస్ వ్యాఖ్యలను కాంగ్రెస్ కూడా ఖండించింది. ప్రధానితో లింక్ ఉన్న అదానీ స్కామ్‌తో భారత్‌లో ప్రజాస్వామ్య పునరుజ్జీవనం జరుగుతుందా లేదా అనేది పూర్తిగా కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు, తమ ఎన్నికల ప్రక్రియపై ఆధారపడి ఉంటుందని కాంగ్రెస్ లీడర్ జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. దీనితో జార్జ్ సోరోస్‌కు ఏమాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. నెహ్రూవియన్ లెగసీ సోరోస్ వంటి వ్యక్తులు తమ ఎన్నికల ఫలితాలపై ప్రభావం వేయకుండా కాపాడుతుందని వివరించారు.
కాగా, స్మృతి ఇరానీపై శివసేన నేత ప్రియాంక చతుర్వేది ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ‘జార్జ్ సోరోస్ ఎవరు అసలు? బీజేపీ ట్రోల్ మంత్రాలయ అతనికే మొత్తం ప్రెస్ కాన్ఫరెన్స్ అంకితం ఎందుకు చేస్తున్నట్టు? సరే గానీ, భారత ఎన్నికల ప్రక్రియలో ఇజ్రాయెల్ ఏజెన్సీ జోక్యంపై మంత్రిగారు ఏమైనా వ్యాఖ్యానిస్తారా? అది భారత ప్రజాస్వామ్యానికి పెద్ద ముప్పు’ అని ట్వీట్ చేశారు.