
Udaipur Murder Case: రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో చోటుచేసుకున్న క్రూరమైన హత్య ఘటనతో.. రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ హత్యాఘాతుకం.. కేవలం రాజస్థాన్ తో కాకుండా.. పలు రాష్ట్రాల్లోపొలిటికల్ హీటును రాజేసింది. బీజేపీ, కాంగ్రెస్ ల మధ్య మాటల యుద్దానికి కారణమైంది. ప్రస్తుతం ఈ ఆంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ క్రమంలో ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ఉదయ్‌పూర్ లో దారుణానికి పాల్పడిన ఇద్దరు నిందితులపై రాజస్థాన్ పోలీసులు చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ-ఉపా) కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటన ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉద్దేశించిందిగా ఆయన పేర్కొన్నారు. అలాగే, నిందితులకు విదేశాల్లో పరిచయాలు ఉన్నట్లు కూడా సమాచారం అందిందని తెలిపారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో సీఎం అశోక్ గెహ్లాట్ గురువారం (జూన్ 30న) ఉదయపూర్‌లో పర్యటించనున్నారు. మృతుడు టైలర్ కన్హయ్య లాల్ కుటుంబాన్ని కలిసి, పరామర్శించనున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర అధికారాలు ఏర్పాటు చేశారు. మరోవైపు.. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అంతకు ముందు.. జిల్లాలో పెరుగుతున్న ఉద్రిక్తత దృష్ట్యా.. సిఎం గెహ్లాట్ ఉదయపూర్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై సమావేశాన్ని నిర్వహించారు. ఉదయ్‌పూర్ ఘటనకు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో భీమ్ (రాజ్‌సమంద్)లో గాయపడిన పోలీసు కానిస్టేబుల్‌ను సాయంత్రం తర్వాత సీఎం గెహ్లాట్ పరామర్శిస్తారు.
ఉదయపూర్ హత్యపై రాజస్థాన్ అఖిలపక్ష సమావేశం
రాజస్థాన్‌లోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉదయ్‌పూర్‌లో దర్జీ హత్యను తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై శాంతి, సంయమనం ఉండాలని ప్రజలకు ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. నాగరిక సమాజంలో ఇటువంటి చర్యలకు స్థానం లేదని, నేరానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నామని బిజెపితో సహా పార్టీలు ఏకగ్రీవంగా పేర్కొన్నాయని అధికారిక ప్రకటన తెలిపింది.
రాష్ట్ర ప్రజలు శాంతి, సామరస్యాలను కాపాడుకోవాలని, ఈ పరిస్థితుల్లో సంయమనంతో వ్యవహరించడమే సరైన మార్గమని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కేసును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దర్యాప్తు చేస్తోందని, రాజస్థాన్ పోలీసులకు చెందిన యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) మరియు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజి) ఎన్‌ఐఎతో సమన్వయం చేస్తున్నాయని ప్రభుత్వం పేర్కొంది.
ఉదయపూర్ హత్య సంబంధించిన కంటెంట్‌ను తొలగించాలని ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను కోరింది. ఉదయపూర్ హత్యకు సంబంధించిన కంటెంట్‌కు సంబంధించి సోషల్ మీడియా సైట్‌లు విచక్షణ యుతంగా ఉపయోగించాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరుతోంది. సంఘటనకు మతపరమైన కోణాన్ని అందించే కంటెంట్‌ను తొలగించాల్సిన అవసరం ఉందని వర్గాలు పేర్కొన్నాయి.
బుజ్జగింపు రాజకీయాలు మానుకోవాలి: వసుంధర రాజే
“రాష్ట్రంలో పాలన లేదు, కేవలం రాజకీయాలు ఉన్నాయి, అందుకే సీఎం ఢిల్లీకి వెళ్లి అక్కడ రాహుల్ గాంధీని సమర్థించారు. నిందితులు ప్రధానమంత్రిని కూడా హెచ్చరించారు. ఇలా మాట్లాడగలిగే విశృంఖల పాలన ఏ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండకూడదు’’ అని ఉదయపూర్ హత్యపై బీజేపీ నాయకురాలు వసుంధర రాజే ఆగ్రహం వ్యక్తం చేశారు. సాకులు చెప్పడం మానివేయాలని, ఈ ఘటనపై ఇతరులను నిందించడం మానివేసి.. బాధ్యత తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో దుష్పరిపాలన, ప్రతికూల రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు జరుగుతాయని వసుంధర రాజే ఆగ్రహం వ్యక్తం చేశారు.