రాజస్తాన్‌లో అప్పులు చెల్లించలేని వారి మైనర్ కూతుళ్ల వేలం.. మహిళా కమిషన్ల ఆగ్రహం.. సీఎం గెహ్లాట్ ఏమన్నారంటే?

By Mahesh KFirst Published Oct 29, 2022, 12:46 PM IST
Highlights

రాజస్తాన్‌లో మైనర్ బాలికలను అప్పుల కింద సెటిల్‌మెంట్‌గా స్టాంప్ పేపర్‌లపై వేలం వేస్తున్నట్టు వచ్చిన వార్తా కథనాలు కలకలం రేపాయి. వెంటనే నివేదిక అందించాలని మహిళా కమిషన్లు కోరాయి. రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఈ ఘటనపై తాజాగా, సీఎం అశోక్ గెహ్లాట్ కూడా ఇలా స్పందించారు.
 

జైపూర్: రాజస్తాన్‌లో మైనర్ బాలికల వేలం ఘటనలు వెలుగులోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బిల్వారా జిల్లాలోని కొన్ని గ్రామాల్లో అప్పులు కట్టలేని వారి కూతుళ్లను స్టాంప్ పేపర్లపై వేలం వేస్తున్నారని కథనాలు వచ్చాయి. బాలికలను వేలం వేయడానికి లేదా.. కుల పంచాయతీలో నిర్ణయించిన షరతులను అంగీకరించకుంటే వారి తల్లులను అత్యాచారం చేయవచ్చనే ఆదేశాలూ ఇవ్వడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ఈ ఉదంతాలు వెలుగులోకి రాగానే సంచలనంగా మారాయి. మహిళా కమిషన్లు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యాయి. ప్రతిపక్ష బీజేపీ.. అధికార పార్టీపై దుమ్మెత్తిపోసింది. తాజాగా, ఈ ఘటనలపై సీఎం అశోక్ గెహ్లాట్ స్పందించారు.

ఈ ఘటనలు 2005లో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు జరిగాయని సీఎం గెహ్లాట్ విమర్శించారు. 2019లో తాము అధికారంలోకి వచ్చారని, ఆ తర్వాత వీటిని బట్టబయలు చేసినట్టు తెలిపారు. ఇందులో 21 మంది నిందితులను అరెస్టు చేశామని, ముగ్గురు నిందితులు మరణించగా.. ఒకరు పరారీలో ఉన్నారని వివరించారు. కాగా, ఇద్దరు బాధిత చిన్నారులు మరణించారని తెలిపారు. మిగతా వారంతా వారి వారి ఇళ్లకు వెళ్లిపోయారని చెప్పారు. ఇప్పుడు ఇది జాతీయ వార్తగా మారిందని పేర్కొన్నారు.

Also Read: అప్పులు సెటిల్ చేయడానికి బాలికల వేలం.. అంగీకరించకుంటే వారి తల్లుల రేప్!

ఈ ఉదంతంలో నిందితులు అందరినీ కచ్చితంగా పట్టుకుని తీరుతామని సీఎం అశోక్ గెహ్లాట్ అన్నారు. కచ్చితమైన దర్యాప్తు చేపడుతామని, ఒక్కరినీ వదిలిపెట్టబోమని వివరించారు.

ఈ ఘటనపై నివేదికలు అందించాలని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, రాజస్తాన్ స్టేట్ కమిషన్ ఫర్ విమెన్‌లు ప్రభుత్వాన్ని ఆదేశించాయి. ఎనన్‌సీపీఆర్, ఎన్‌సీడబ్ల్యూలు తమ దర్యాప్తు బృందాలను పంపిస్తున్నట్టు వెల్లడించాయి.

Also Read: అండమాన్‌లో జాబ్ ఫర్ సెక్స్ రాకెట్.. ఇద్దరు ప్రభుత్వ అధికారుల భాగోతం బట్టబయలు

రాజస్తాన్‌లోని బిల్వారా జిల్లాలో దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. అక్కడ అప్పులను తిరిగి చెల్లించకుంటే.. వారి కూతుళ్లను స్టాంప్ పేపర్ పై వేలం వేస్తున్నట్టు తెలిసింది. అప్పులు చెల్లించలేని వారి 8 నుంచి 18 ఏళ్ల కూతుళ్లను వేలం వేస్తారని, వారిని వ్యభిచార రొంపిలోకి దింపే బ్రోకర్లు స్టాంప్ పేపర్లపై కొనుగోలు చేస్తారని కథనాలు వచ్చాయి. ఇలా అభం శుభం తెలియని బాలికలను ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ముంబయి, ఢిల్లీ, బయటి దేశాలకూ పంపిస్తున్నట్టు ఆరోపణలు వచ్చాయి. ఒక వేళ కుల పంచాయతీలో ఖరారైన షరతులను అంగీకరించకపోతే.. ఆ వివాదానికి పరిష్కారంగా తల్లుల అత్యాచారాన్ని పేర్కొంటున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. మహిళలను బానిసలుగా చేసే ఈ విధానాలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నది. ఈ వార్తా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది.

click me!