Rajasthan Elections 2023 : ఒక్క కుటుంబం కోసం అతిచిన్న పోలింగ్ కేంద్రం.. అదెక్కడంటే..

By SumaBala Bukka  |  First Published Nov 25, 2023, 9:56 AM IST

రాజస్థాన్ లో శనివారం ఉదయం మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గానూ 199 నియోజకవర్గాల్లో ఓటింగ్ ప్రారంభమయ్యింది.  


రాజస్థాన్ : రాజస్థాన్లో శనివారం ఉదయం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరుకున్నాయి. ఐదురాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. ఈరోజు రాజస్థాన్లో పోలింగ్ ప్రారంభం కాగా, నవంబర్ 30న  తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ఏడు గంటలకు రాజస్థాన్లో ప్రారంభమైన పోలింగ్.. ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 200 సీట్లకుగాను 199 స్థానాల్లో పోలింగ్  మొదలైంది.  కరణ్ పూర్ అసెంబ్లీ నియోజకవర్గస్థానం నుంచి పోటీలో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ కూనార్ మరణించారు. దీంతో అక్కడ ఎన్నికలు వాయిదా పడ్డాయి.

రాజస్థాన్ ఎన్నికల్లో ఓ ఆసక్తికర ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.  ఒక గ్రామంలో ఒక్క కుటుంబం కోసం ప్రత్యేకంగా పోలింగ్ బూత్ ను ఏర్పాటు చేయడం  ఆసక్తి రేపుతోంది. పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న బార్మర్ జిల్లా పార్ గ్రామంలో 35 మంది ఉంటారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మూడు వేర్వేరు ఇళ్లల్లో నివసిస్తున్నారు. ఈ 35 మందిలో 18మంది పురుషులు, 17 మంది మహిళలు ఉన్నారు. వీరి కోసం పోలింగ్ బూత్ ను అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ పోలింగ్ బూత్ రాజస్థాన్ రాష్ట్రంలోనే అతి చిన్న పోలింగ్ కేంద్రంగా నిలిచింది.  

Latest Videos

Narendra Modi : నేడు హైదరాబాద్ కు ప్రధాని మోడీ.. మూడు రోజుల పాటూ తెలంగాణలోనే..

గత ఎన్నికల వరకు పార్ గ్రామానికి చెందిన వీరంతా ఓటు వేయడం కోసం దాదాపు 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించేవారు. ఈ గ్రామం పాకిస్తాన్ సరిహద్దుకి ఆనుకొని ఉండడంతో ఇబ్బందులు పడేవారు. చుట్టూ ఎడారి రోడ్లు సరిగా లేకపోవడంతో..  ఒంటెలపై, కాలినడకన పోలింగ్ బూత్ కు చేరుకునేవారు. పోలింగ్ బూత్ చాలా దూరం ఉండడంతో వెళ్లడం తీవ్ర ఇబ్బందులతో కూడుకుని ఉండడంతో..మహిళలు, కొంతమంది వృద్ధులు ఓటు హక్కును వినియోగించుకునేవారు కాదు. ఈ పరిస్థితిని గమనించిన ఎన్నికల కమిషన్ అధికారులు ఈసారి అలా జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే పార్ గ్రామంలో ప్రత్యేకంగా పోలింగ్  కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తమను గుర్తించి పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం పట్ల ఆ గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 

click me!