వచ్చిపోయే రైళ్లను లెక్కించడమే.. నెలరోజులు స్టేషన్‌లో కూర్చోబెట్టి , నిరుద్యోగులకు 2 కోట్లు టోకరా

By Siva KodatiFirst Published Dec 20, 2022, 2:28 PM IST
Highlights

రైల్వేలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ.2.6 కోట్లు టోకరా వేశాడో కేటుగాడు. వచ్చి పోయే రైళ్లను లెక్కించడమే పని అని చెప్పి ఓ రైల్వే స్టేషన్‌లో నెల రోజులు కూర్చోబెట్టాడు.

పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. నిరుద్యోగులను కొందరు ట్రాప్ చేస్తూ కోట్ల రూపాయలను దండుకుంటున్నారు. ఎన్ని ఘటనలు వెలుగులోకి వస్తున్నా అభ్యర్ధులు కూడా జాగ్రత్తలు తీసుకోకపోవడంతో కేటుగాళ్ల ఆగడాలకు చెక్ పడటం లేదు. తాజాగా రైల్వే శాఖలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులకు రూ.2 కోట్లకు పైగా టోకరా వేశాడో కేటుగాడు. వివరాల్లోకి వెళితే.. తమిళనాడుకు చెందిన సుబ్బుసామి అనే వ్యక్తి ఎక్స్ సర్వీస్‌మెన్. ఈ క్రమంలో ఆయనకు కోయంబత్తూరుకు చెందిన శివరామన్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. సెంట్రల్ గవర్నమెంట్‌లో తనకు పరిచయాలు వున్నాయని.. తన పలుకుబడితో రైల్వేలో ఉద్యోగాలు ఇప్పించగలనని శివరామన్ మాయమాటలు చెప్పాడు. ఇది నిజమేనని నమ్మిన సుబ్బుసామి.. తనకు తెలిసిన ముగ్గురు యువకులను అతని వద్దకు తీసుకొచ్చాడు. తర్వాత మధురై నుంచి మరో పాతిక మంది నిరుద్యోగులు కూడా వచ్చారు. 

అనంతరం ఈ 28 మంది యువకులను వికాస్ రాణా అనే వ్యక్తికి శివరామన్ పరిచయం చేశాడు. తను నార్త్ రైల్వేలో డిప్యూటీ డైరెక్టర్‌నని వికాస్ రాణా చెప్పాడు. టీటీఈ, ట్రాఫిక్ అసిస్టెంట్, క్లర్క్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ 28 మంది యువకుల నుంచి తలా రూ.2 లక్షల చొప్పున రూ.24 లక్షల వరకు వసూలు చేశాడు. తర్వాత వైద్య పరీక్షలు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, నకిలీ ఐడీ కార్డులు, ట్రైనింగ్ లెటర్ ఇచ్చి ఢిల్లీలోని ఓ రైల్వే స్టేషన్‌లో దాదాపు నెల రోజుల పాటు కూర్చోబెట్టాడు. 

Also Read: రష్యాలో ఉద్యోగాల పేరిట నిరుద్యోగులకు టోకరా... భారీగా డబ్బులు వసూలుచేసి మోసం

ప్రతిరోజూ 8 గంటల పాటు ఆ స్టేషన్‌లో వచ్చిపోయే రైళ్లను, వాటికున్న బోగీలను లెక్కించడమే పని అని వికాస్ రాణా వారందరికీ చెప్పాడు. నెల రోజుల తర్వాత వికాస్ రాణా వారికి అపాయింట్‌మెంట్ లెటర్లు ఇచ్చాడు. దీంతో సంబరపడిపోయిన నిరుద్యోగులు.. వాటిని తీసుకుని రైల్వే అధికారుల వద్దకు వెళ్లగా అవి ఫోర్జరీ పత్రాలని తేలింది. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

click me!