
Rahul Gandhi video case: కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను ప్లే చేస్తూ.. సమాచారాన్ని తప్పుగా నివేదించిన ఓ ప్రముఖ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ను అరెస్టు చేయడానికి ఛత్తీస్‌గఢ్ పోలీసులు-ఉత్తరప్రదేశ్ పోలీసుల మధ్య కొనసాగుతున్న ఘర్షణ వాతారణం నేపత్యంలో ఒక రోజు తర్వాత.. రాయ్‌పూర్ పోలీసుల బృందం బుధవారం ఘజియాబాద్‌లోని యాంకర్ ఇంటికి వెళ్ళింది. అయితే, అక్కడ రోహిత్ రంజన్ కనిపించలేదని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. "యాంకర్ రంజన్ పరారీలో ఉన్నాడు.. అతని జాడ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి" అని రాయ్‌పూర్ సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ ప్రశాంత్ అగర్వాల్ PTI కి చెప్పారు.
అంతకుముందు, కాంగ్రెస్ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్ జిల్లా పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఢిల్లీకి సమీపంలోని ఇందిరాపురం ప్రాంతంలోని జీ న్యూస్ యాంకర్ రంజన్ ఇంటికి వెళ్లారు. అయితే, అంతకుముందే అతన్ని నోయిడా పోలీసులు అరెస్టు చేశారు. తరువాత రాత్రి బెయిల్‌పై విడుదల చేశారు. రాయ్‌పూర్ పోలీసు బృందం బుధవారం ఉదయం 9 గంటలకు ఘజియాబాద్‌లోని రంజన్ ఇంటికి చేరుకుంది. అయితే అతని ఇంటికి బయటి నుండి తాళం వేసి కనిపించింది. అగర్వాల్ ఆచూకీ కోసం పోలీసు బృందం ప్రయత్నిస్తోంది.
నిందితుడి ఆచూకీ కోసం మంగళవారం సెక్టార్ -20 పోలీస్ స్టేషన్ (నోయిడాలోని)కి వెళ్లినందున, అతన్ని బెయిల్‌పై విడుదల చేసిన నోయిడా పోలీసులు రాయ్‌పూర్ పోలీసులకు సమాచారం అందించాల్సి ఉంది. వారు అతని గురించి మాకు ఏమీ చెప్పలేదు.. మంగళవారం సాయంత్రం అతను బెయిల్‌పై విడుదలైనట్లు పేర్కొంటూ ప్రెస్ నోట్ విడుదల చేశారు. ఇప్పుడు అతను పరారీలో ఉన్నాడని అధికారి పేర్కొన్నారు. IPC సెక్షన్ 505 (2) కింద నమోదైన కేసులో ప్రశ్నించడానికి జీ న్యూస్ యాంకర్ రోహిత్ రంజన్‌ని ఇందిరాపురంలోని అతని నివాసం నుండి నోయిడాకు తీసుకువచ్చారు. "విచారణ తర్వాత, సాక్ష్యాల ఆధారంగా అతన్ని అరెస్టు చేశారు. అతనిపై ఉన్న సెక్షన్లు బెయిలబుల్ నేరాలు కావడంతో బెయిల్‌పై విడుదలయ్యాడు. ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని ఆ ప్రకటనలో తెలిపారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం నాడు జీ న్యూస్‌లో రంజన్, సహా పలువురిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే దేవేంద్ర యాదవ్ ఫిర్యాదు ఆధారంగా వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, మతపరమైన భావాలను రెచ్చగొట్టడం వంటి ఆరోపణలపై కేసు నమోదైందని అగర్వాల్ తెలిపారు.
కాగా, రాహుల్ గాంధీకి సంబంధించిన ఒక వీడియోలో రాహుల్ గాంధీ తన వయనాడ్ కార్యాలయం పై దాడిని ప్రస్తావించారు. ఈ దాడులు చేసిన యువకులు చాలా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. అయినా కూడా వారు చిన్న పిల్లలు… క్షమించేయండి అని పేర్కొన్నారు. అయితే, జీ ఛానల్ యాంకర్ రోహిత్ రంజన్.. ఆ వ్యాఖ్యలు.. ఉదయపూర్ లో హత్యకు పాల్పడిన వారిని చిన్నపిల్లలని, వారిని క్షమించి వదిలేయాలంటూ.. చెబుతున్నట్లుగా వక్రీకరించి సమాచారాన్ని అందించారు.