
Rajnath Singh: పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విదేశాంగ విధాన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. విదేశాంగ విధాన విషయంలో కేంద్రం చేసిన వ్యూహాత్మక తప్పిదమే చైనా, పాకిస్థాన్‌లను ఏకతాటిపైకి తెచ్చిందని రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలపై అధికార పార్టీ నేతలతో పాటు మంత్రులు స్పందిస్తూ.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండిస్తున్నారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి జైశంకర్.. ఆ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్ వ్యాఖ్యలు సరైనవి కావని అన్నారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం రాహుల్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
పాకిస్థాన్-చైనా సంబంధాలపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ స్పందించిన ఒకరోజు తర్వాత.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. రాహుల్ గాంధీ గాల్వాన్ వ్యాలీపై తన వాదనలతో చరిత్రను వక్రీకరించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. 'రాహుల్ గాంధీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారు. గాల్వాన్ వ్యాలీ ఘర్షణ సమయంలో ఒక్క అంగుళం కూడా చైనాకు వెళ్లలేదు' అని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పంజాబ్ లో ఎన్నికల ప్రచార ర్యాలీలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. పై వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చరిత్ర తెలియదని విమర్శించారు. చైనా-పాకిస్థాన్ విషయంలో కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు."గాల్వాన్ ఘర్షణ జరిగినప్పుడు రాహుల్ గాంధీ స్వయంగా చైనా రాయబారితో కలిసి విందు చేస్తున్నారు" అని రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. చైనా, పాక్ ఆక్రమిత కశ్మీర్‌పై మాజీ ప్రధానులు జవహర్‌లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ లోపభూయిష్ట విధానాన్ని అనుసరించారని రక్షణ మంత్రి ఆరోపించారు. రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగించాయని రాజ్‌నాథ్ అన్నారు. పంజాబ్ ఎన్నికలలో ఆమ్ ఆద్మీ పార్టీ అవకాశాలపై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, “పంజాబ్‌కు పంజాబీలు కావాలి, ఆప్ కాదు. AAP ప్రకటనలలో బోగస్ వాదనలు చేస్తోంది. మా వాళ్ళకి భిక్ష అక్కర్లేదు. వారు భారతదేశం సగర్వంగా తల ఎత్తాలని కోరుకుంటున్నారు అని అన్నారు. పంజాబ్ భూమి పవిత్రమని రక్షణ మంత్రి అన్నారు.
రైతుల సమస్యల పట్ల ప్రధాని మోదీ సున్నితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. “అతను ఎప్పుడూ మొండితనం ప్రదర్శించలేదు. అందుకే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. 2.37 లక్షల కోట్ల విలువైన గోధుమలు/వరి సేకరణకు ఏర్పాట్లు చేశాం. మోదీ ప్రభుత్వం పేదలకు కట్టుబడి ఉంది’’ అని రాజ్ నాథ్ సింగ్ పేర్కొన్నారు. అలాగే, గాల్వన్ వ్యాలీలో మన వీర సైనికులు పరాక్రమాన్ని, త్యాగాన్ని ప్రదర్శించారని రాజ్‌నాథ్ అన్నారు. సైనికుల ధైర్యసాహసాల వల్ల భారత్‌లో ఒక్క అంగుళం కూడా చైనా స్వాధీనం చేసుకోలేకపోయింది. చైనా అధికారిక పత్రిక 4 మంది సైనికుల మరణం గురించి మాట్లాడింది, అయితే మరణించిన చైనా సైనికుల సంఖ్య 38 నుండి 50 వరకు ఉండవచ్చని ఆస్ట్రేలియన్ పత్రిక రాసిన కథనాలను రాహుల్ చదవాలని గుర్తుచేశారు.