కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీపై బీజేపీ దాడి చేస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లలో తమ పార్టీ ప్రభుత్వాలు పడిపోతున్నాయని రాహుల్ గాంధీ నోరు జారడంపై బీజేపీ విరుచుకుపడింది. కాంగ్రెస్ అధినేత ఓటమిని అంగీకరించారని అధికార పక్షం పేర్కొంది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సోమవారం మీడియా ముందు మాట్లాడుతూ.. నోరు జారారు. దీనిపై బీజేపీ దుమ్మెత్తిపోస్తూ ఎన్నికలకు ముందే రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లలో ఓటమిని అంగీకరించిందని అన్నారు.
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం అనంతరం రాహుల్ గాంధీ విలేకరులతో మాట్లాడారు. కాగా, ఐదు రాష్ట్రాల మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం అసెంబ్లీ ఎన్నికల తేదీల ప్రకటనపై ఆయన స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వం, రాజస్థాన్‌లో ప్రభుత్వం, ఛత్తీస్‌గఢ్‌లో కూడా ప్రభుత్వం నిష్క్రమిస్తోందన్నారు.
ఇది జరిగిన వెంటనే రాహుల్ గాంధీ తన తప్పును గ్రహించి, 'నేను తప్పుగా మాట్లాడాను.. మీరు (జర్నలిస్టు) నన్ను గందరగోళానికి గురిచేశారు' అని అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుత ప్రదర్శన చేస్తుందని రాహుల్ గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు. పార్టీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల పని తీరును ఆయన కొనియాడారు.
మరోవైపు రాహుల్ గాంధీ టంగ్ స్లిప్ వీడియోను బీజేపీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'X (గతంలో ట్విట్టర్)'లో పోస్ట్ చేసింది, "రాహుల్ గాంధీ తన ఓటమిని అంగీకరించారు, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ లల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది!" అని పేర్కొన్నారు. తాజాగా ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. చాలా మంది బిజెపి నాయకులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. కాంగ్రెస్, రాహుల్ గాంధీలపై విరుచుకపడుతున్నారు.
ఎన్నికల షెడ్యూల్
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సోమవారం ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించారు. నవంబర్ 30న తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు. దీంతో పాటు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా ప్రకటనలు చేశారు. ఎన్నికల తేదీలను ప్రకటిస్తూ.. నవంబర్ 7న మిజోరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లో రెండు దశల్లో నవంబర్ 7, 17 తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. మధ్యప్రదేశ్‌లో నవంబర్ 17న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అలాగే.. రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలకు నవంబర్ 23 న ఓటింగ్ జరగనుంది, అన్ని రాష్ట్రాల ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3 న జరుగుతుంది.