
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, వాయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ ఈ నెలాఖరులో బ్రిటన్‌కు వెళ్లనున్నారు, అక్కడ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలోని బిజినెస్ స్కూల్‌లో ఉపన్యాసం ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ట్వీట్ ద్వారా తెలియజేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి వెళ్లి బిజినెస్ స్కూల్‌లో ఉపన్యాసం ఇవ్వనున్నట్టు తెలిపారు. భౌగోళిక రాజకీయాలు, అంతర్జాతీయ సంబంధాలు, డేటా, ప్రజాస్వామ్యంతో సహా అనేక రంగాలకు చెందిన కొంతమంది తెలివైన వారితో సంభాషించడానికి తాను చాలా ఎదురుచూస్తున్నానని రాహుల్ గాంధీ అన్నారు.
అంతకుముందుకు కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ ట్వీట్ చేసింది. రాహుల్ గాంధీకి తిరిగి స్వాగతం పలకడం ఆనందంగా ఉందని కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్ పేర్కొంది. రాహుల్ గాంధీ.. కేంబ్రిడ్జ్ బిజినెస్ స్కూల్‌లో ఉపన్యాసం ఇస్తారని, బిగ్ డేటా అండ్ డెమోక్రసీ, ఇండియా-చైనా సంబంధాలపై చర్చలు జరుపుతారని ట్వీట్‌లో పేర్కొంది. బ్రిటన్ వెళ్లే ముందు రాహుల్ గాంధీ ఫిబ్రవరి 24-26 తేదీల్లో రాయ్‌పూర్‌లో జరిగే కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశానికి హాజరవుతారు.ఈ సెషన్‌లో 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ వ్యూహరచన చేయడంతోపాటు పలు అంతర్గత అంశాలపై చర్చించనున్నారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బుధవారం రెండు రోజుల వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఉత్తర కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌కు చేరుకుని స్కీయింగ్‌కు వెళ్లారు. ఇటీవల రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా శ్రీనగర్ చేరుకున్నారు. గుల్‌మార్గ్‌లో రాహుల్ గాంధీ కూడా గొండోలా కేబుల్ కార్ రైడ్ చేసి స్కీయింగ్‌కు వెళ్లారు. అక్కడ ఉన్న పలువురు పర్యాటకులతో కాంగ్రెస్ నాయకుడు సెల్ఫీలు కూడా దిగారు.