పరువు నష్టం కేసులో శిక్షను సవాలు చేసేందుకు సిద్దమైన రాహుల్ గాంధీ.. రేపే సూరత్ కోర్టులో పిటిషన్..!

By Sumanth KanukulaFirst Published Apr 2, 2023, 11:59 AM IST
Highlights

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రిమినల్ పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడం, శిక్ష విధించడాన్ని సవాలు చేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది.

న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్రిమినల్ పరువు నష్టం కేసులో తనను దోషిగా తేల్చడం, శిక్ష విధించడాన్ని సవాలు చేసేందుకు సిద్దమైనట్టుగా తెలుస్తోంది. పరువు నష్టం కేసులో తనకు రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ ఉత్తర్వులు జారీ చేయడంపై రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సూరత్ సెషన్ కోర్టులో ఆయన ఈ పిటిషన్‌ దాఖలు చేయనున్నట్టుగా తెలుస్తోంది. ఆ పిటిషన్‌లో రాహుల్ గాంధీ.. పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తున్న మేజిస్ట్రేట్ ఉత్తర్వును రద్దు చేయాలని సెషన్స్ కోర్టును కోరనున్నట్టుగా తెలుస్తోంది. సెషన్ కోర్టులో తీర్పు వెలువడే  వరకు తనకు ట్రయల్ కోర్టు విధించిన శిక్షపై మధ్యంతర స్టే విధించాలని కూడా అభ్యర్థించనున్నారు. 

ఇదిలా ఉంటే..  2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు కర్ణాటకలోని కోలారులో జరిగిన ర్యాలీలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ..  మోదీ ఇంటి పేరు కలవారందరూ దొంగలే అనే అర్థం వచ్చేలా కామెంట్ చేశారు. ‘‘దొంగలందరికీ మోదీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది?’’ అని ప్రశ్నించారు. ఇందుకు సంబంధించిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ.. సూరత్ కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా నిర్ధారించిన చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హెచ్‌హెచ్ వర్మ.. ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించారు. 

Also Read: రాహుల్ గాంధీపై మరో కేసు.. ‘21వ శతాబ్దపు కౌరవులు’ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేసిన ఆర్ఎస్ఎస్ కార్యకర్త

అయితే ఆయనకు వెంటనే బెయిల్ మంజూరు చేశారు. పై కోర్టులో అప్పీల్ చేసుకునేందుకు 30 రోజుల గడువు ఇచ్చారు. అయితే సూరత్ కోర్టు తీర్పు వెలువడ్డ మరుసటి రోజే లోక్‌సభ సెక్రెటేరియట్ ఓ నోటిఫికేషన్‌లో రాహుల్‌పై లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు వేస్తున్నట్టుగా వెల్లడించింది. అయితే అనర్హత వేటు కోర్టు తీర్పు వెలువడిన రోజు నుంచే అమల్లోకి వచ్చినట్టు ఆ నోటిఫికేషన్‌లో వెల్లడించింది. ఇక, 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్  గాంధీ వయనాడ్ నుంచి విజయం సాధించారు. 

మరోవైపు ఇదే వ్యాఖ్యలకు సంబంధించి బీహార్ బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ దాఖలు చేసిన మరో పరువు నష్టం కేసును కూడా గాంధీ ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 12న తమ ముందు హాజరుకావాలని పాట్నా కోర్టు రాహుల్ గాంధీని ఆదేశించింది. 

click me!