
న్యూఢిల్లీ: కర్ణాటకలో కాంగ్రెస్‌కు మంచి మద్దతు ఉన్నదని, తప్పకుండా పార్టీ గెలిచి తీరుతుందని రాహుల్ గాంధీ అన్నారు. అయితే, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ 150 సీట్లు గెలవాలని సూచించారు. లేదంటే తర్వాతి ప్రభుత్వాన్ని బీజేపీ దొంగిలిస్తుందని ఆరోపించారు. బీజేపీ అత్యంత అవినీతిమయమైన పార్టీ అని పేర్కొన్నారు.
పార్టీలోని ప్రతి ఒక్కరూ భారత దేశ ఐడియాను సమర్థించాలని, బీజేపీ, ఆర్ఎస్ఎస్‌ల నుంచి దేశాన్ని కాపాడాలని అన్నారు. రాహుల్ గాంధీ కర్ణాటకలో రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. అక్కడ కోలార్, బెంగళూరు, బీదర్‌లలో సమావేశాలు నిర్వహించి తిరిగి ఢిల్లీకి వచ్చారు.
బీజేపీ దేశంలో చేస్తున్న విద్వేషం, హింస, వ్యవస్థలపై దాడుల గురించి మనందరికీ తెలిసిందే అని రాహుల్ అన్నారు. ఇవన్నీ కనిపిస్తున్నాయని తెలిపారు.
‘కర్ణాటకలో ఎన్నికలు వస్తున్నాయి. కాంగ్రెస్‌కు బలమైన ప్రజా మద్దతు ఉన్నది. ఈ ఎన్నికల్లో పార్టీ తప్పకుండా గెలిచి తీరుతుందనే నమ్మకం నాకు ఉన్నది... అయితే మనం 150 సీట్లు గెలుచుకోవాలి. ఎందుకంటే బీజేపీ అవినీతికర పార్టీ. కర్ణాటక ప్రజల నుంచి దోచుకున్న సొమ్ము ఆ పార్టీకి బోలెడు ఉన్నది. కాబట్టి, తదుపరి ప్రభుత్వాన్నీ దొంగిలించుకోవడానికి కచ్చితంగా ప్రయత్నం చేస్తారు’ అని రాహుల్ గాంధీ అన్నారు.
Also Read: అవార్డు కార్యక్రమంలో విషాదం.. మండే ఎండల్లో 6 గంటలు.. 11 మంది మృతి!.. 600 మందికి వడదెబ్బ
బసవరాజ్ బొమ్మై ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ ఇది 40 శాతం సర్కారు అని ఆరోపించారు. బీజేపీ.. అవినీతికరమైన స్థితి కంటే కూడా ఇంకా ముందుకు వెళ్లిపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇది తమ ప్రభుత్వం కాదని తెలుసు అని వివరించారు. బీజేపీ వాళ్లు ప్రజా సమయాన్ని ఇన్నాళ్లు వృథా చేశారని తెలిపారు. ఇది ఎన్నికైన ప్రభుత్వం కాదని, దొంగిలించుకున్న ప్రభుత్వం అని వివరించారు.